భారత్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ - రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. టీమిండియా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జోడిగా అరుదైన రికార్డు సాధించారు. ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఘనత అందుకున్నారు. దశాబ్దకాలం పాటు టెస్టు ఫార్మాట్‌లో భారత్ సాధించిన విజయాల్లో వీరిద్దరు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
అయితే అంతకుముందు భారత్ తరపున సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జంటగా అనిల్ కుంబ్లే,హర్భజన్ సింగ్ పేరిట రికార్డు ఉంది. 54 టెస్టుల్లో కలిసి ఆడిన వీరిద్దరు 501 వికెట్లు సాధించారు. కుంబ్లే 281 వికెట్లు, భజ్జీ 220 వికెట్లు తీశారు. కాగా, ఈ రికార్డును అశ్విన్, జడేజా 50 టెస్టుల్లోనే అధిగమించారు. ప్రస్తుతం జరుగుగుతన్న ఇంగ్లాండ్ టెస్టులో ఓపెనర్లు క్రాలే, డకెట్‌లను అశ్విన్, పోప్‌ను జడ్డూ ఔట్ చేయడంతో ఉమ్మడిగా 503 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. వీటిల్లో అశ్విన్ 276 వికెట్లు తీయగా, జడేజా 227 వికెట్లు పడగొట్టాడు.

కాగా, ఈ క్రమంలో అశ్విన్ మరో రికార్డును నమోదు చేసుకున్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 150 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో యాష్ మూడో స్థానంలో ఉన్నాడు. అశ్విన్ కంటే ముందు స్థానాల్లో కమిన్స్ (169), నాథన్ లయాన్ (169) ఉన్నారు. అయితే వారిద్దరు వరుసగా 40, 41 టెస్టులు ఆడితే అశ్విన్ కేవలం 31 టెస్టులు మాత్రమే ఆడాడు.
కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ బాజ్‌బాల్ అప్రోచ్‌తోనే బ్యాటింగ్ చేస్తోంది. వికెట్లు పడుతున్నా దూకుడు కొనసాగిస్తోంది. క్రాలే (20; 40 బంతుల్లో), డకెట్ (35; 39 బంతుల్లో) తొలి వికెట్‌కు 52 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే అశ్విన్, జడేజా బంతిని అందుకున్న తర్వాత ఇంగ్లాండ్ స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 55/0తో మెరుగైన స్థితిలో ఉన్న ఇంగ్లిష్ జట్టు 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ జో రూట్ (18*; 35 బంతుల్లో), బెయిర్ స్టో (32; 44 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దారు. లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 108/3 స్కోరుతో నిలిచింది.