R Ashwin Retirement:భారత్ ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. భారత అభిమానులు హమ్మయ్యా అనుకునే లోపే టీమిండియా క్రికెటర్ స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ తాను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా అతని అభిమానులు షాక్‌కు గురయ్యారు. అదే సమయంలో ఎక్స్ (ట్విటర్) వేదికగా ఇండియన్ క్రికెట్‌కు అశ్విన్ అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇదే జాబితాలో పలువురు ప్రముఖ క్రికెటర్లు కూడా ఉన్నారు. భారత్ ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్ వర్షార్పణం అయినప్పటికీ.. అశ్విన్ రిటైర్‌మెంట్ ఇప్పుడు ప్రధాన చర్చగా నిలిచింది.
ఇండియా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటన ఒక్కింత షాక్‌కు గురిచేయడమే కాదు.. ఇది సరైన సమయం కూడా కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఏది ఏమైనప్పటికీ తన ప్రకటనతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ఇక రిటైర్మెంట్ సమయంలో అశ్విన్ మాట్లాడుతూ తన సహచరుల గురించి ప్రస్తావించారు. కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు పలువురు టీమిండియా ప్లేయర్ల గురించి మాట్లాడాడు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరును ప్రస్తావించకపోవడాన్ని ధోనీ అభిమానులు తప్పుబడుతున్నారు.

తన ప్రయాణంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు చాలా కీలకంగా వ్యవహరించారని వారికి ధన్యవాదాలు తెలిపాడు అశ్విన్ . తన బౌలింగ్‌లో వీరంతా వికెట్ల వెనకాల ఉండి అద్భుతమైన క్యాచ్‌లు పట్టి తన కెరీర్‌లో సాధించిన వికెట్లలో కీలకంగా వ్యవహరించారన్నాడు. టీమిండియా కోచ్‌లు,భారత్ తరపున ఆడేందుకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు.

ధోనీ పేరు అశ్విన్ కావాలనే ప్రస్తావించలేదా..?
అశ్విన్ టీమిండియాలోకి అరంగేట్రం చేసిన నాటికి కెప్టెన్‌గా ధోనీ ఉన్నాడు. అశ్విన్ ఆస్థాయికి చేరడంలో కచ్చితంగా ధోనీ ఇచ్చిన ప్రోత్సాహం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ధోనీ నాయకత్వంలోనే అశ్విన్ జట్టులో ఉండగా టీమిండియా 2011 వరల్డ్ కప్ గెలిచింది.2013లో ధోనీ నాయకత్వంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ కైవసం చేసుకుంది. అలాంటి వ్యక్తిని అశ్విన్ ఎలా మరిచాడన్న మాట వినిపిస్తోంది. అయితే ప్రెస్‌మీట్ సందర్భంగా తాను ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేనని అశ్విన్ స్పష్టత ఇచ్చాడు. అందుకే ధోనీ పేరును ప్రస్తావించడం మరిచి ఉంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. అశ్విన్, ధోనీ మంచి స్నేహితులు. వారి మధ్య మంచి సంబంధాలున్నాయి. ఐపీఎల్ 2025లో ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్‌కు కలిసి ఆడతారు. అయితే అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటన సందర్భంగా మాట్లాడిన మాటల్లో ధోనీ పేరును ప్రస్తావించకపోవడాన్ని అభిమానులు తీసుకోలేకపోతున్నారు. అయితే తాను కావాల్సిగా ఆ తప్పు చేయలేదనేది స్పష్టమవుతోంది.