
బిగ్ బ్యాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ మరో విజయం సాధించింది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం నమోదు చేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు విజయం పెర్త్‌నే వరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అడిలైడ్ స్ట్రైకర్స్ సారధి పీటర్ సిడిల్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతను అనుకున్న ఆరంభం ఆ జట్టుకు లభించలేదు.
అడిలైడ్ ఓపెనర్ హెన్రీ హంట్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ మాథ్యూ షార్ట్ (16)ను అగర్ బౌల్డ్ చేశాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన క్రిస్ లిన్ (35)ను బెహ్రెండాఫ్ రనౌట్ చేశాడు. ఆ తర్వాత మిడిలార్డర్‌లో ఆడమ్ హోస్ (18), కోలిన్ డి గ్రాండ్‌హోమ్ (19), థామస్ కెల్లీ (18) ముగ్గుర్నీ ఆండ్రూ టై అవుట్ చేశాడు. దీంతో ఆ జట్టు భారీ స్కోరు చేసే అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. చివర్లో బెంజమిన్ మానెటి (4) రనౌట్ కాగా.. హ్యారీ నీల్సన్ (11 నాటౌట్) పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి అడిలైడ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.
లక్ష్యం అంత పెద్దది కాకపోయినా పెర్త్ కూడా ఛేదనలో తడబడింది. ఆ జట్టు టాపార్డర్ కూడా దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (6), ఆడమ్ లిత్ (4) విఫలమయ్యారు. మరో బ్యాటర్ నిక్ హాబ్సన్ (4) కూడా నిరాశ పరిచాడు. అలాంటి సమయంలో జోష్ ఇంగ్లిస్ (19), ఆరోన్ హార్డీ (22) మరో వికెట్ పడకుండా అడ్డుకట్ట వేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఆష్టన్ టర్నర్ (48 నాటౌట్) అద్భుతంగా ఆడాడు.
అయితే అతనికి ఇతరుల నుంచి సహకారం పెద్దగా అందలేదు. స్పెషలిస్టు బ్యాటర్లు ఎవరూ అందుబాటులో లేకున్నా.. టెయిలెండర్లు ఆష్టన్ అగర్ (6), ఝై రిచర్డ్‌సన్ (18), ఆండ్రూ టై (5 నాటౌట్)తో కలిసి ఎలాగోలా జట్టును విజయతీరాలకు చేర్చాడు టర్నర్. అతని పోరాటంతో పెర్త్ జట్టు 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన టర్నర్‌కే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.