కోహ్లీ బ్యాటింగ్ అద్భుతం.. కానీ కెప్టెన్‌గా ఇంకా..: నెహ్రా

ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మన్‌గా అద్భుతాలు చేస్తున్నాడు అని భారత మాజీ క్రికెటర్ అశిష్ నెహ్రా అన్నాడు. అయితే కెప్టెన్‌గా మాత్రం ఇంకా పరిణతి సాధించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ ఇప్పటికే అనితరసాధ్యమైన రికార్డులు కొల్లగొట్టినప్పటికీ.. జట్టును నడిపించే విషయంలో అనుభవం సంపాదించాల్సి ఉందని పేర్కొన్నాడు.

కెప్టెన్‌గా కోహ్లీ పరిణతి సాధించాలి:
భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా నిర్వహించే ఆకాశవాణి షోలో అశిష్ నెహ్రా పాల్గొని పలు విషయాలు పంచుకున్నాడు. 'కోహ్లీ బ్యాటింగ్ కెరీర్ గ్రాఫ్ చూస్తే అర్థమవుతుంది. అతని ఆటతీరు ఎలా ఉందో. కోహ్లీ ఇప్పటికే అనితరసాధ్యమైన రికార్డులు కొల్లగొట్టాడు. కానీ కెప్టెన్‌గా అతను ఇంకా ఎదుగాల్సి ఉంది. మైదానంలో దూకుడుతనం చూపించినా.. పరిస్థితులకు తగ్గట్లు మెదలడంలో భారత కెప్టెన్ మెరుగవ్వాలని నేను భావిస్తున్నా' అని నెహ్రా అన్నాడు.

ఆస్ట్రేలియా జట్టుతో పోల్చడం అవివేకం:
ప‌్రస్తుత భారత జట్టును 1990-2000లోని ఆస్ట్రేలియా జట్టుతో పోల్చడం అవివేకమని ఆశిస్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. మరో ఆసీస్‌లా మారడానికి కోహ్లీసేన ఇంకా చాలా దూరంలో ఉందన్నాడు. 'వరుసగా మూడు వన్డే ప్రపంచకప్‌లను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టుతో ప్రస్తుత భారత జట్టును పోల్చడం అవివేకం. అప్పట్లో గొప్ప సారథులు (స్టీవ్ వా, రికీ పాంటింగ్) నడిపించిన ఆసీస్ జట్టు శత్రు దుర్భేద్యంగా ఉండేది. వన్డేల్లోనే కాదు, టెస్టుల్లోనూ వరుసగా 18-20 మ్యాచ్‌ల వరకు ఓటమి ఎరుగకుండా దూసుకెళ్లింది. అలాంటి జట్టుతో కోహ్లీసేనను పోల్చడం భావ్యం కాదు' అని పేర్కొన్నాడు.

మరిన్ని అవకాశాలు ఇవ్వాలి:
'ఎంఎస్ ధోనీకి వారసుడనుకున్న రిషబ్ పంత్.. డ్రింక్స్ మోయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. వచ్చిన అవకాశాలను అతను వృథా చేసుకున్నాడన్న సంగతి తెలుసు. పిన్న వయసులో జాతీయ జట్టుకు ఆడే సత్తా ఉందని భావించినప్పుడు.. అతనిపై నమ్మకముంచాలి. మరిన్ని అవకాశాలు ఇవ్వాలి' అని నెహ్రా పేర్కొన్నాడు. మాజీ ఆటగాడైన ఆకాశ్ చోప్రా ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా క్రీడాటోర్నీలన్నీ రద్దు కావడంతో ఆకాశ్ చోప్రా సామాజిక మాధ్యమాల్లో ఆకాశవాణి పేరుతో ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాడు. ఆశిస్ నెహ్రా భారత్ తరఫున 17 టెస్టులు, 120 వన్డేలు, 27 టీ20లు ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications