2007 టీ20 ప్రంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జాబ్ కోసం గుజరాత్ టైటాన్స్ వద్దకు వెళ్లానని, అయితే ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆశిష్ నెహ్రా తన అభ్యర్థనను తిరస్కరించాడని పేర్కొన్నాడు. టీమిండియాలోనే కాకుండా ఐపీఎల్‌లో యువీ సత్తాచాటిన విషయం తెలిసిందే. పంజాబ్, బెంగళూరు, ముంబయి జట్ల తరపున ఐపీఎల్‌లో ప్రాతినిథ్యం వహించాడు. 132 మ్యాచ్‌ల్లో 2750 పరుగులు చేశాడు.
''ప్రస్తుతం నా పిల్లలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నా. వారు స్కూల్‌కు వెళ్లడం మొదలుపెడితనే నాకు సమయం దొరుకుతుంది. యువకులకు కోచ్‌గా పనిచేయడమంటే ఇష్టం. ముఖ్యంగా నా రాష్ట్ర కుర్రాళ్లతో కలిసి పనిచేయాలని ఉంది. అయితే మెంటార్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాలనుకుంటున్నా. ఐపీఎల్‌లో ఏదైనా జట్టుకు మెంటార్‌గా ఉండాలని భావిస్తున్నా. గుజరాత్ టైటాన్స్‌లో నెహ్రాను ఉద్యోగం కోసం అడిగాను. కానీ అతడు తిరస్కరించాడు. మరెక్కడైనా అవకాశం లభిస్తుందేమో చూద్దాం. రాబోయే సంవత్సరాల్లో కచ్చితంగా కొత్త బాధ్యతలు అందుకుంటా. యువ క్రికెటర్లకు సాయం చేస్తా'' అని యువరాజ్ అన్నాడు.

వన్డే, టీ20ల భారత జట్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కకూడదని, అతడు అనర్హుడని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. అశ్విన్ గొప్ప బౌలర్ అని, అయితే బ్యాటుతో, ఫీల్డర్‌గా ప్రభావం చూపలేడని అన్నాడు.టెస్టు జట్టులో అశ్విన్ ఉండాలని యువీ అన్నాడు. ముంబయి ఇండియన్స్ తమ కెప్టెన్‌ను మార్చడంపై స్పందిస్తూ.. ఫ్రాంచైజీ క్రికెట్‌లో వయసు పెరిగేకొద్దీ ఆటగాళ్లు క్లిష్టపరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నాడు.
భారీగా ఖర్చు పెట్టిన యువ ప్లేయర్లపైనే ఫ్రాంచైజీలు మొగ్గు చూపుతాయని, వాస్తవానికి అదే న్యాయమని అన్నాడు. తాను కూడా అలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నానని వివరించాడు. అయితే అనుభవాన్ని భర్తీ చేయడం ఎవరకీ సాధ్యం కాదని అన్నాడు. ఈ ఏడాదిలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు హార్దిక్ పాండ్య టీమిండియాకు కీలకమని, అతడు కోలుకోవడానికి తగిన సమయం ఇవ్వాలని సూచించాడు. అలాగే టీమిండియా కెప్టెన్సీ విషయంలో హార్దిక్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని అన్నాడు.