
కంప్లీట్ ఫాస్ట్ బౌలర్‌గా
వరల్డ్ క్రికెట్‌లో కంప్లీట్ ఫాస్ట్ బౌలర్‌గా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రా.. 50 టెస్టు వికెట్లను వేగంగా సాధించిన తొలి టీమిండియా బౌలర్‌గా తన పేరిట రికార్డును లిఖించుకున్నాడు. అన్ని ఫార్మాట్లకు సరిపోయే భారత పేసర్‌గా బుమ్రాకు మంచి గుర్తింపు ఉంది. బుమ్రా చాలా తక్కువ కాలంలో ఎన్నో ఘనతలు సాదించాడు. అయితే బుమ్రా కంటే గొప్ప బౌలర్ భారత క్రికెట్ జట్టులో ఉన్నాడని టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అంటున్నాడు. హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్.. బుమ్రా కంటే ముందువరుసలో ఉంటాడని నెహ్రా అభిప్రాయపడ్డాడు. బుమ్రా కంటే సిరాజ్ గొప్ప బౌలర్ అని పేర్కొన్నాడు.

బుమ్రా కంటే సిరాజ్ గొప్ప
తాజాగా క్రిక్‌బజ్‌తో ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ... 'గత 3-4 ఏళ్ల నుంచి భారత బౌలర్ల విషయానికొస్తే కేవలం జస్ప్రీత్ బుమ్రా గురించే మాట్లాడతున్నారు. ఇదేమీ తప్పుకాదు. అతడు బాగా రాణిస్తున్నాడు. కానీ స్కిల్స్ ప్రకారం చూస్తే.. బుమ్రా కంటే మహ్మద్ సిరాజ్ ఏమాత్రం తక్కువ కాదు. బుమ్రాకు ఎంతమాత్రం తీసిపోడు. నా దృష్టిలో స్కిల్స్‌లో బుమ్రా కంటే సిరాజే గొప్ప పేసర్ అనుకుంటున్నా. అన్ని ఫార్మాట్లను ప్రభావం చేసే బౌలర్ అతడు. అతనికి ఆ సామర్థ్యం ఉంది' అని అన్నాడు.

సిరాజ్ సాధించలేనిది ఏమీ ఉండదు
'సిరాజ్ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ గేమ్ పరిస్థితిని అర్థం చేసుకుంటే అతను సాధించలేనిది ఏమీ ఉండదు. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని మాత్రమే అతనికి సూచిస్తున్నా. కొన్ని సంవత్సరాల క్రితం సిరాజ్ గురించి మాట్లాడుకున్నాం. భారత్-ఎ జట్టుకు ఆడేటప్పుడు ప్రతీ మ్యాచ్‌లోనూ 5-6 వికెట్లు తీశేవాడు. అప్పుడు అతనొక మంచి రెడ్‌బాల్ క్రికెట్ బౌలర్ అని నేను నమ్మేవాడ్ని. అలా ఆ రెడ్ బౌలర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిరాజ్.. వైట్‌బాల్ క్రికెట్‌లో దాన్ని కొనసాగిస్తున్నాడు. జట్టులోకి ఇప్పుడే వచ్చాడు కాబట్టి.. టీమిండియాకు చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది' అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు.

తమ జట్లకు కీలక బౌలర్లు:
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు బుమ్రా ప్రాతినిథ్యం వహిస్తుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున సిరాజ్ ఆడుతున్నాడు. ఇద్దరూ ఇప్పుడు తమ జట్లకు కీలక బౌలర్లు. 27 ఏళ్ల సిరాజ్ భారత్ తరఫున 5 టెస్టులు, ఒక వన్డే. మూడు టీ20లు ఆడాడు. 27 ఏళ్ల బుమ్రా టీమిండియాకు 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20లు ఆడాడు.


Click it and Unblock the Notifications












