వచ్చే వన్డే వరల్డ్ కప్-2027 వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీమిండియాలో కొనసాగుతారా లేదా అనే దాని గురించి ఇప్పుడే ఆలోచించకూడదని మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్ వంటి యువ క్రికెటర్లు పరుగులతో సత్తాచాటుతున్నారని, వాళ్లకు దీటుగా రోహిత్-కోహ్లి పరుగులు చేయాల్సి ఉందని నెహ్రా అభిప్రాయపడ్డాడు.
టీ20 వరల్డ్ కప్ విజయానంతరం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు ఫార్మాట్లకు వారిద్దరు ఎప్పటివరకు అందుబాటులో ఉంటారనే ప్రశ్నలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు వారిద్దరు టీమిండియాలోనే ఉంటారని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా, భారత జట్టు నయా కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు.

అయితే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కోహ్లి-రోహిత్ ఉంటారా అనే దానిపై చర్చలు మొదలయ్యాయి. దీనిపై నెహ్రా మాట్లాడాడు. వన్డే మెగాటోర్నీ వరకు వారిద్దరు జట్టులో కొనసాగవచ్చని అయితే రెండు విషయాలు మాత్రం కీలకమని నెహ్రా అన్నాడు. మానసికంగా, శారీరకంగా వాళ్లు దృఢంగా ఉండటం ముఖ్యమని తెలిపాడు. ఆట పరంగా వారిద్దరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నాడు.
అలాగే అప్పటివరకు వారిద్దరు ఫామ్‌లో ఉండటం కూడా కీలకమని నెహ్రా అన్నాడు. గిల్, జైస్వాల్, సుదర్శన్ సత్తాచాటుతూ ముందుకు వస్తున్నారని, దీంతో రోహిత్-కోహ్లి కూడా మెరుగైన ప్రదర్శన కొనసాగించాల్సి ఉంటుందని అన్నాడు. క్రికెట్ ఆడటం గురించి చెప్పాలంటే.. జీవితాంతం కుర్రాడిగానే ఉండాలని కోరుకుంటానని, అప్పుడు రిటైర్మెంట్ అనేదే ఉండదని నెహ్రా అన్నాడు.
''జీవితాంతం కుర్రాడిలానే ఉంటే, రిటైర్‌మెంట్ అనేది ఉండదు. అలా జరిగితే గంభీర్ సైతం కుర్రాళ్లకు బదులుగా తానే బరిలోకి దిగుతానని అంటాడు.'సాయి సుదర్శన్ వద్దు. ఆడటానికి నేను సిద్ధం' అని చెప్తాడు. కానీ అలా జరగదు కదా! వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఇప్పుడే దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు'' అని నెహ్రా పేర్కొన్నాడు.