
హైదరాబాద్: క్రికెట్ చూడటం అంటే తనకు ఇష్టం ఉండదని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టు డ్రాగా ముగియడంలో స్మిత్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్ (275 బంతుల్లో 102 నాటౌట్; 6 ఫోర్లు) ఇంగ్లాండ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ 4వ టెస్టు మ్యాచ్ స్కోరు కార్డు
స్టీవ్ స్మిత్‌కు తోడుగా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (227 బంతుల్లో 87; 8 ఫోర్లు), మిచెల్ మార్ష్ (166 బంతుల్లో 29 నాటౌట్) రాణించడంతో నాలుగో టెస్టుని డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 103/2తో శనివారం ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 124.2 ఓవర్లలో 263/4 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
ఫలితం రాదని ముందే తేలడంతో ఇరు జట్ల కెప్టెన్‌లు 'డ్రా'కు అంగీకరించారు. ఇదిలా ఉంటే ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌ను ఆసీస్ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సిరీస్ చేజారినప్పటికీ చివరి రెండు టెస్టుల్లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ ఆటగాళ్లు మెల్ బోర్న్ టెస్టులో గట్టిగా ప్రయత్నించారు.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, వర్షం మ్యాచ్‌కి అడ్డంకిగా మారడం, ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ నమోదు చేయడంతో ఈ టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం స్మిత్ మీడియాతో మాట్లాడాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నందుకు కారణం ఏమిటని అడగ్గా 'ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా బ్యాటింగ్ చేయడమే. ఇది నా వృత్తి అంతే. నిజం చెప్పాలంటే నాకు ఎక్కువగా క్రికెట్ చూడటమంటే ఇష్టం ఉండదు. ప్రతి బంతిపై దృష్టి సారించి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ప్రతి బంతి సవాల్‌తో కూడుకున్నదే' అని స్మిత్ తెలిపాడు.
ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు గురువారం సిడ్నీలో ప్రారంభం కానుంది.