
హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను 0-3తో చేజార్చుకున్న ఇంగ్లాండ్‌కు ఐదో టెస్టుకు ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా గురువారం (జనవరి 4) నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టుకు ఆ జట్టు ప్రధాన పేసర్ క్రిస్ వోక్స్ దూరమయ్యాడు.
అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ మాసన్ క్రేన్‌ను జట్టులో చోటు కల్పించారు. ఇంగ్లాండ్ తరుపున కేవలం రెండు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మాసన్ క్రేన్ సిడ్నీ టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. గాయం కారణంగా క్రిస్ వోక్స్ ఐదో టెస్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో 20 ఏళ్ల క్రేన్ ఎంపికయ్యాడు.
ఈ విషయాన్ని ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ ఐదో టెస్టు మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించాడు. 'ఓ యువ ఆటగాడిగా క్రేన్ ఈ యాషెస్ సిరిస్ మొత్తం జట్టుతోనే ప్రయాణించాడు. ఇక్కడి పరిస్థితులను చక్కగా ఆకలింపు చేసుకున్నాడు. ఐదో టెస్టులో క్రేన్ ప్రభావం తప్పక ఉంటుంది' అని అన్నాడు.

'ఇంగ్లాండ్ తరుపున ఎలాగైతే టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేశాడో.. అదే విధంగా తన అంతర్జాతీయ క్రికెట్‌ను కొనసాగిస్తాడు. తనకు ఎదురైన సవాల్ నుంచి తప్పించుకునే ఆటగాడు కాదు. ఈ పర్యటనలో తనకు అందివచ్చిన అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకుంటాడు' అని అన్నాడు.
అతడికి ఇదొక మంచి అవకాశమని, సిడ్నీ టెస్టుకు అతడి ఎంపిక సరైందేనని భావిస్తున్నానని జో రూట్ చెప్పుకొచ్చాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను 0-3తో చేజార్చుకున్న ఇంగ్లాండ్ మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టుని డ్రాగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య గురువారం చివరిదైన ఐదో టెస్టు ప్రారంభం కానుంది.