యాషెస్ సిరీసులో ఇంగ్లండ్‌కు వాళ్ల బాజ్‌బాల్ ఏమాత్రం కలిసిరాలేదు. తొలి రెండు టెస్టుల్లో ఈ టీం చాలా ఘోరంగా ఓడింది. అయితే బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మూడో టెస్టులో ఇంగ్లండ్ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను కేవలం 263 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్ బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించారు. అయితే ఇంగ్లండ్ బ్యాటర్లు కూడా ఈ మ్యాచ్‌లో తేలిపోయారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ (80) ఒక్కడే రాణించాడు. మిగతా వాళ్లంతా దారుణంగా ఫెయిలయ్యారు. దీంతో ఆ టీం 237 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వర్షం కారణంగా రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. కేవలం 90 పరుగుల వ్యవధిలోనే ఆరుగురు ఆసీస్ బ్యాటర్లను అవుట్ చేశారు.

ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్ (77) ఒక్కడే రాణించాడు. దీంతో ఆ జట్టు 224 పరుగులు చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడుతున్నారు. ఈ క్రమంలో అందరూ ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. యాషెస్ సిరీసులో ఇంగ్లండ్‌కు బాజ్‌బాల్ ఏమాత్రం ఉపయోగపడటం లేదని గవాస్కర్ స్పష్టం చేశాడు.
'బాజ్‌బాల్ గురించి మర్చిపోతే మంచిది. తక్కువ క్వాలిటీ బౌలింగ్ ఉన్న జట్లపై బాజ్‌బాల్ బాగా పనిచేసింది. కానీ టాప్ క్లాస్ అయిన ఆస్ట్రేలియన్ బౌలింగ్‌పై బాజ్‌బాల్ పనికిరాదు. ఈ బౌలింగ్ ఎదుర్కోవాలంటే సంప్రదాయ బద్ధంగా సుదీర్ఘ సమయం క్రీజులో బ్యాటింగ్ చేయకతప్పదు. టీ20 షాట్లు ఆడతానంటే కుదరదు. ఎంతైనా టెస్టు క్రికెట్ అంటే.. టెస్టు క్రికెటే కదా' అని గవాస్కర్ అన్నాడు.
ఈ బాజ్‌బాల్‌ను బలహీన జట్ల కోసం వాడుకోవాలంటూ గవాస్కర్ సలహా ఇచ్చాడు. ఇంతకుమందు ఇంగ్లండ్ లెజెండ్ జెఫ్రీ బాయ్‌కాట్ కూడా ఈ బాజ్‌బాల్ విధానాన్ని తిట్టిపోశాడు. 'మ్యాచ్ ఆడేది గెలవడానికి అనే విషయాన్ని ఇంగ్లండ్ టీం మర్చిపోయింది. ఎంటర్‌టైన్ చేయాలనుకోవడం మంచిదే. కానీ గెలిచి కూడా ఎంటర్‌టైన్ చేయొచ్చు. మరీ అతి పోతే ఫలితం ఉండుద. ఇంగ్లండ్ అదే చేసింది. కనీసం ఆలోచించడం కూడా మర్చిపోయారు' అంటూ మండిపడ్డాడు.
కేవలం ఎంటర్‌టైన్ చేయాలనుకుంటే సర్కస్ పెట్టుకోవచ్చు కదా అంటూ ఘాటుగానే విమర్శించాడు. ఒకవేళ ఈ యాషెస్ సిరీస్‌ను ఆసీస్ నెగ్గితే.. బెన్ స్టోక్స్ కెప్టెన్ అయిన తర్వాత ఇంగ్లండ్ ఓడిపోయిన తొలి సిరీస్‌గా ఇది నిలుస్తుంది. ఇంతకుముందు న్యూజిల్యాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లపై ఇంగ్లండ్ బాజ్‌బాల్‌ను నమ్ముకొనే విజయాలు నమోదు చేసింది. కానీ ఆసీస్‌పై ఈ పాచిక పారడం లేదు.