యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ ఓడిపోయింది. కానీ ఆ టీం కెప్టెన్ బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం మాత్రం అందరి మన్ననలు పొందింది. నాలుగో ఇన్నింగ్సులో భారీ లక్ష్య ఛేదనలో మిగతా బ్యాటర్లు అంతా విఫలమైనా కూడా.. స్టోక్స్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో టెయిలెండర్ల సహకారంతో జట్టుకు విజయం అందించేందుకు ప్రయత్నించాడు. కానీ చివర్లో జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఈ మ్యాచ్‌లో నెమ్మదిగా తన ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టోక్స్ ఆ తర్వాత గేరు మార్చాడు. బెయిర్‌స్టో అవుటైన తర్వాత ఇక బ్యాటర్లు లేకపోవడంతో తనే జట్టును గెలిపించాల్సిన బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో లంచ్ బ్రేక్‌కు ముందు ఐదు ఓవర్లలో 50 పరుగులు చేశాడు. ముఖ్యంగా గ్రీన్ ఓవర్లో మూడు సిక్సర్లతో చెలరేగాడు. అతని ఆట చూస్తే ఇంగ్లండ్ అనూహ్య విజయం సాధిస్తుందనే అంతా అనుకున్నారు.

అంత తీవ్రమైన ఒత్తిడి, టెన్షన్‌లో కూడా స్టోక్స్ చెలరేగడాన్ని ఆసీస్ ప్లేయర్లు కూడా తెగ మెచ్చుకున్నారు. ఆ టీం స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితిలో అయినా జట్టును గెలిపించే సత్తా స్టోక్స్‌కు ఉందని కొనియాడాడు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా స్పందించాడు.
ఈ మ్యాచ్‌లో 214 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్ 155 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ ఆటతీరును భారత యువ సంచలనం రిషభ్ పంత్‌తో పోల్చాడీ మాజీ ప్లేయర్. 'తీవ్రమైన ఒత్తిడిలో కూడా ఏం చెయ్యాలనే క్లారిటీ ఉండటం గొప్ప విషయం. ఈ ఒక్క లక్షణమే ఇంగ్లండ్ టీంలో స్టోక్స్‌ను భిన్నంగా చూపిస్తుంది. భారత్‌లో రిషభ్ పంత కూడా అచ్చం అలాంటి వాడే' అని మంజ్రేకర్ అన్నాడు.