యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో చాలా చెత్తగా ఆడుతున్నాడు. వికెట్ల వెనుక ఘోరంగా తడబడుతున్నాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ అతనిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ సిరీసులో ఇంగ్లండ్ వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ గెలిచేందుకు జట్టంతా శ్రమిస్తోంది.
ఇలాంటి సమయంలో ఈజీ క్యాచులు వదిలేస్తున్న బెయిర్‌స్టో టీంకు పెద్ద శనిలా దాపురించాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ప్రమాదకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను బెయిర్‌స్టో నేలపాలు చేశాడు. బౌన్సర్లు ఆడటంలో హెడ్ కొంత ఇబ్బంది పడతాడు. కాబట్టి వాటితోనే అతని ఆట కట్టించాలని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భావించాడు.

ఈ ప్లాన్‌తోనే మార్క్ వుడ్‌ను బౌలింగ్‌కు పంపాడు. అతను 146.45 కిలోమీటర్ల వేగంతో బౌన్సర్ వేశాడు. దాన్ని ఆడటంలో తొందరపడిన హెడ్ తడపడ్డాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి బెయిర్‌స్టో కుడివైపు వెళ్లింది. డైవ్ చేసి దాన్ని అందుకుంటాడని అనుకుంటే.. బెయిర్‌స్టో మాత్రం డైవ్ చేసి దాన్ని నేలపాలు చేశాడు. అయితే బ్యాటుకు బంతి తాకినా కూడా.. దాన్ని అంపైర్ నితిన్ మీనన్ బైగా ఇవ్వడం గమనార్హం.
అంతకుముందు ఆసీస్ కీలక ప్లేయర్ స్టీవ్ స్మిత్‌కు కూడా బెయిర్‌స్టో ఒక లైఫ్ ఇచ్చాడు. ఓలీ రాబిన్సన్ వేసిన బంతిని స్మిత్ డిఫెండ్ చేసుకోబోయాడు. అయితే ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. కీపర్ వైపు వెళ్లింది. తన ఎడమ వైపు వచ్చిన ఆ క్యాచ్‌ను క్యారీ చేయడంలో బెయిర్‌స్టో తడబడ్డాడు. ఈ క్యాచ్ అందుకోవడం కష్టమైనా.. బంతి చేతుల్లోకి వచ్చిన తర్వాత వదిలేయడం ఒక కీపర్ చేయాల్సిన పని కాదు.
ఈ క్రమంలో ఇద్దరు ప్లేయర్లకు జీవనాదం ఇచ్చిన బెయిర్‌స్టోను ఇంగ్లండ్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఎలాగైనా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇలా క్యాచులు నేలపాలు చేయడమేంటని మండిపడుతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ట్రావిస్ హెడ్ ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తుచేస్తూ.. బెయిర్‌స్టో చెత్త కీపింగ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.