యాషెస్‌లో ఎట్టకేలకు ఇంగ్లండ్ బోణీ కొట్టింది. ఆసీస్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కుర్ర బ్యాటర్ హ్యారీ బ్రూక్‌తోపాటు క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ రాణించడంతో ఈ జట్టు విజయం తన ఖాతాలో వేసుకుంది. ఆసీస్ చేతిలో వరుసగా ఏడు ఓటముల తర్వాత ఇంగ్లండ్‌కు దక్కిన తొలి విజయం ఇది కావడం గమనార్హం. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ చివరి రోజు ఒక దృశ్యం అందర్నీ ఆకర్షించింది.
రెండో టెస్టులో జానీ బెయిర్‌స్టో అవుట్‌పై పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇంగ్లండ్ మాజీలు, ఫ్యాన్స్ అందరూ ఆసీస్‌ను తిడుతున్నారు. 'సేమ్ ఓల్డ్ ఆసీస్.. చీటింగ్ ఆల్వేస్' (ఎప్పట్లాగే ఆసీస్ ఎప్పుడూ చీటింగ్ చేస్తుంది) అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. ఇక మూడో టెస్టులో కూడా ఫ్యాన్స్ 'సేమ్ ఓల్డ్ ఆసీస్' అంటూ ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఆటపట్టించారు.

దీన్ని స్థానికంగా ఉన్న ఒక పబ్ ఓనర్ మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఏకంగా ఒక చిన్న విమానాన్ని అద్దెకు తీసుకొని, దానికి బ్యానర్ కట్టించాడు. ఆ బ్యానర్‌పై 'సేమ్ ఓల్డ్ ఆసీస్ - టేలర్స్ స్పోర్ట్స్ బార్' అని రాయించాడు. మూడో టెస్టు జరుగుతున్న హెడింగ్లే మైదానం మీదుగా ఈ విమానం వెళ్తూ ఈ బ్యానర్‌ను ప్రదర్శించడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అయితే మూడో టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో 251 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం 50 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. హ్యారీ బ్రూక్ (75), క్రిస్ వోక్స్ (32 నాటౌట్), మార్క్ వుడ్ (16 నాటౌట్) రాణించారు. అటు బంతితో, ఇటు బ్యాటుతో అద్భుతంగా రాణించిన మార్క్ వుడ్‌కు ఈ మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆప్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.