ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ మాట నిలబెట్టుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ను తెగ ఇబ్బంది పెట్టి, ప్రధాన బ్యాటర్లు అందర్నీ పెవిలియన్ చేర్చిన బౌలర్ స్కాట్ బోలాండ్‌ను ఇంగ్లండ్ బ్యాటర్లు ఉతికి ఆరేస్తారని ఆ దేశ మాజీలు చెప్పారు. ముఖ్యంగా మేకేల్ వాన్ ఈ విషయం పదే పదే చెప్పాడు.
బోలాండ్ కనుక ఆడితే ఇంగ్లండ్ బ్యాటర్లు అతనికి చుక్కలు చూపిస్తారని చెప్తూనే వచ్చాడు. అయితే భారత్‌పై అతని బౌలింగ్ చూసిన చాలా మంది అలా జరగదని అనుకున్నారు. బోలాండ్ బౌలింగ్‌లో అంత పేస్ ఉండదని, అందుకే అతన్ని ఇంగ్లండ్ ప్లేయర్లు ఆడుకుంటారని చాలా మంది చెప్పినా.. మరీ అంత ఈజీగా అతన్ని ఆడలేరని అనుకున్నారు.

కానీ యాషెస్ తొలి టెస్టులోనే బోలాండ్‌కు ఇంగ్లిష్ బ్యాటర్లు నిజంగానే చుక్కలు చూపించారు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా అతన్నే టార్గెట్ చేసి ఉతికి ఆరేశారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బోలాండ్ 14 ఓవర్లు వేశారు. అతని బౌలింగ్‌లో ఏకంగా 6.14 ఎకానమీతో 86 పరుగులు పిండుకున్నారు ఇంగ్లండ్ బ్యాటర్లు. ఈ ఇన్నింగ్స్‌లో బోలాండ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసుకోగలిగాడు.
ఇక రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లండ్.. ఆ ఇన్నింగ్స్‌లో కూడా అతని బౌలింగ్‌లో ఎదురు దాడి చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు వేసిన అతను 5 ఎకానమీతో పరుగులు ఇచ్చుకున్నాడు. చివర్లో బ్రాడ్, ఆండర్సన్ క్రీజులో ఉండగా వేసిన ఓవర్ కారణంగా అతని ఎకానమీ కొంత తగ్గింది. లేదంటే ఈ ఇన్నింగ్స్‌లో కూడా అతని బౌలింగ్‌ను ఇంగ్లిష్ బ్యాటర్లు ఒక ఆట ఆడుకున్నారనే చెప్పాలి.
అయితే ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్సుల్లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ అద్భుతంగా బౌలింగ్ వేయడం గమనార్హం. అతని బౌలింగ్‌పై ఎదురు దాడి చేస్తామని ఇంగ్లండ్ కుర్ర బ్యాటర్ హ్యారీ బ్రూక్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లిష్ బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టిన లియాన్.. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా నాలుగు వికెట్లతో చెలరేగడం గమనార్హం.