ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు విజయంతో మొదలు పెట్టింది. తొలి టెస్టులో అద్భుతమైన పోరాట పటిమ కనబరిచిన ఈ జట్టు చివరకు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్ బాజ్‌బాల్ ట్యాక్టిక్‌ను మట్టి కరిపించింది. దీంతో ఆస్ట్రేలియా ఈ సిరీసులో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 393 పరుగులకు డిక్లేర్ చేసింది. తొలి రోజు చివరికే ఇలా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఆ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను ఇంగ్లండ్ బౌలర్లు 386 పరుగులకు ఆలౌట్ చేశారు. అనంతరం మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ తడబడింది. ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయారు.

ఆ టీం స్టార్ బ్యాటర్ జో రూట్ (46), యువ సంచలనం హ్యారీ బ్రూక్ (46), కెప్టెన్ బెన్ స్టోక్స్ (43) మాత్రమే ఫర్వాలేదనిపించారు. దీంతో ఆ జట్టు 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో ఆసీస్ ముందు 281 పరుగుల టార్గెట్ నిలిచింది. నాలుగో ఇన్నింగ్సులో ఇది పెద్ద టార్గెటే అయినా.. ఆసీస్‌కే గెలిచే అవకాశం ఉందని చాలా మంది భావించారు. అయితే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ సమీక్షలు మారిపోయాయి.
ఇంగ్లండ్ ఆలౌట్ అయినా కాసేపటికే ఆసీస్ వికెట్లు కూడా టపటపా పడిపోయాయి. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన డేవిడ్ వార్నర్ (36) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే మార్నస్ లబుషేన్ (13), స్టీవ్ స్మిత్ (6) ఇద్దర్నీ స్టువర్ట్ బ్రాడ్ పెవిలియన్ చేర్చాడు. కానీ అప్పటికే ఆసీస్ 107 పరుగులు చేసింది. అనంతరం ఐదో రోజు ఆట ఉత్కంఠ భరితంగా సాగింది.
ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (65) అద్భుతంగా ఆడాడు. కానీ మిగతా బ్యాటరల్లో ఎవరూ అతనికి సహకారం అందించలేకపోయారు. దీంతో ఆసీస్ జట్టు ఓటమి దిశగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ చివర్లో కెప్టెన్ కమిన్స్ (44 నాటౌట్) అద్భుతమైన పోరాట పటిమ చూపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో బంతితో రాణించిన అతను.. బ్యాటుతోనూ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
స్పిన్నర్ నాథన్ లియాన్ (16 నాటౌట్)తో కలిసి కమిన్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. నెమ్మదిగా ఆడుతూ చివరకు ఆసీస్‌ను విజయ తీరాలకు చేర్చాడు. చివరి బౌండరీ కొట్టగానే హెల్మెట్, బ్యాటు విసిరేసి లియాన్‌ను ఎత్తుకొని సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో బాజ్‌బాల్‌కు ఆసీస్ గట్టి సమాధానం ఇచ్చినట్లు అయింది. రెండు ఇన్నింగ్సుల్లో రాణించిన ఉస్మాన్ ఖవాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.