యాషెస్ చివరి టెస్టులో ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 395 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ ముందు ఏకంగా 384 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. దీన్ని ఛేదించడంలో కచ్చితంగా ఆసీస్ తడబడుతుందని అంతా అనుకున్నారు. అయితే ఆసీస్ ఓపెనర్లు రాణించారు.
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి డేవిడ్ వార్నర్ (58 నాటౌట్), ఉస్మాన్ ఖవాజా (69 నాటౌట్) ఇద్దరూ చక్కగా ఆడారు. దీంతో ఆసీస్ వికెట్లేమీ కోల్పోకుండా 135 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు 100 పరుగులపైగా ఓపెనింగ్ పార్టనర్‌షిప్‌లు నెలకొల్పిన ప్లేయర్‌గా నిలిచాడు.

వార్నర్ తన కెరీర్‌లో 25 సార్లు 100+ పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. యాషెస్ చివరి టెస్టులో నెలకొల్పిన భాగస్వామ్యం 25వది. ఈ క్రమంలో అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన ఓపెనర్ల జాబితాలో జాక్ హాబ్స్ (24)ను అధిగమించాడు. ఈ జాబితాలో సౌతాఫ్రికా లెజెండ్ గ్రేమ్ స్మిత్ (24), ఇంగ్లండ్ దిగ్గజం అలిస్టర్ కుక్ (24) కూడా జాక్ హాబ్స్‌తో సమానంగా ఉన్నారు.
ఇక టీమిండియా మాజీ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్‌లో 23 సార్లు ఈ ఫీట్ సాధించాడు. ఇటీవలి కాలంలో అంత గొప్ప ఫామ్‌లో లేని వార్నర్.. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీసులో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయితే చివరి టెస్టులో జట్టును గెలిపించాల్సిన స్థితిలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఖవాజా, వార్నర్ ఇద్దరూ ఈ ఇన్నింగ్సులో రాణించడంతో ఆసీస్ ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి రోజున ఆసీస్ జట్టు 98 ఓవర్లలో 249 పరుగులు చేస్తే ఈ మ్యాచ్ కూడా తమ ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇవ్వడం కచ్చితంగా శుభసూచకమే.