ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో మొదలు పెట్టింది. తొలి టెస్టులో అద్భుతమైన పోరాట పటిమతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్ బాజ్‌బాల్ ట్యాక్టిక్‌ను మట్టి కరిపించింది. దీంతో ఆస్ట్రేలియా ఈ సిరీసులో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు చివర్లోనే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టింది.
దీనిపై ఆ టీం కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. 'నేను ఒక కెప్టెన్‌ను కాబట్టి.. ఆ టైంలో ఆస్ట్రేలియాను మరింత ఒత్తిడిలోకి నెట్టొచ్చు అనిపించింది. అందుకే ఆ పని చేశా. ఏ ఓపెనింగ్ బ్యాటర్ కూడా ఆట ముగియడానికి 20 నిమిషాల ముందు బ్యాటింగ్‌కు వెళ్లాలని అనుకోడు. అందుకే ఆ పని చేశా' అని చెప్పాడు. అయితే ఆ రోజు ఆసీస్ ఓపెనర్లు ఇద్దరూ ఎలాంటి పొరపాటు చేయకుండా తొలి రోజు ఆటను ముగించారు.

ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయినా కూడా.. ఇంగ్లండ్‌కు కేవలం 7 పరుగుల ఆధిక్యమే లభించింది. అదే ఇంగ్లండ్ కనుక తొలి రోజు డిక్లేర్ చేయకుండా మరికొంత సమయం ఆడి ఉంటే మరింత ఆధిక్యం లభించేదే. 'మేం ఆడిన విధానం, ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడి చేయడం చూసి డిక్లేర్ చేయాలనే నిర్ణయం తీసుకున్నా. డిక్లేర్ చేయకపోతే ఐదో రోజు ఇంత ఎగ్జయిట్‌మెంట్ వచ్చేదా?' అని స్టోక్స్ ప్రశ్నించాడు.
'అది నాకు తెలీదు కానీ.. నేనైతే వెనక్కు తిరిగి ఆ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉండేది? ఇలా ఆలోచించను. ఈ ఐదు రోజుల్లో చాలా ఘటనలు జరిగాయి. అలా జరిగుంటే బాగుండేది, ఇలా జరిగి ఉండాల్సింది అనుకోవడం వేస్ట్. నిజం ఏంటంటే.. ఈ వారం మేం విన్నింగ్ లైన్ దాటలేకపోయాం అంతే. ప్రత్యర్థి ఎవరైనా సరే.. మేం మా స్టైల్‌లో ఆడేందుకే ట్రై చేస్తాం. అది మాత్రం మారదు' అని స్టోక్స్ అన్నాడు.
'ఈ మ్యాచ్‌లో మా వ్యూహాలను ఎదుర్కోవాలనే ప్లాన్‌తో ఆసీస్ వచ్చింది. మేం జస్ట్ మిస్ అయ్యాం. లేదంటే ఇక్కడ వేరే ఫలితం గురించి మాట్లాడుతూ ఉండే వాళ్లం. అయినా ఇంకా నాలుగు మ్యాచులు ఉన్నాయి. చాలా క్రికెట్ ఆడాలి. దానిపైనే ఇప్పుడు మా ఫోకస్ అంతా' అని ఇంగ్లండ్ కెప్టెన్ స్పష్టం చేశాడు. రెండో యాషెస్ టెస్టు ఈ నెల 28న మొదలవుతుంది. ఈ విజయంతో కొత్త డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్ తొలి పాయింట్స్ సాధించింది.