యాషెస్ సిరీస్‌లో ఇంగ్లడ్ ఆల్‌రౌండర్ మొయీన్ అలీ పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడో రెండేళ్ల క్రితం 2021లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతను.. ఈ యాషెస్ కోసం రిటైర్‌మెంట్ కూడా వెనక్కు తీసుకున్నాడు. ఇంగ్లండ్ ప్రధాన స్పిన్నర్ జాక్ లీచ్ గాయంతో ఈ సిరీస్‌కు దూరం అవడంతో.. ప్రత్యామ్నాయంగా అలీని ఇంగ్లండ్ జట్టులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లు బౌలింగ్ చేసిన అలీ చేతికి గాయమైంది. అంతగా బౌలింగ్ చేయడం అలవాటు తప్పడంతో అతని స్పిన్నింగ్ వేలు బాగా దెబ్బతిన్నది. అయినా అతను రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఇంగ్లండ్ జట్టుకు అతను చాలా కీలకం కానున్నాడు. ఎందుకంటే ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఈ మ్యాచ్‌లో అదరగొడుతున్నాడు.

లియాన్ పెర్ఫామెన్స్ చూసిన వాళ్లందరూ అలీ నుంచి కూడా అదే స్థాయి ఆటను ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగో రోజు చివర్లో కూడా అలీ బౌలింగ్ చేశాడు. దీనిపై ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్ స్పందించాడు. అలాంటి గాయంతో బౌలింగ్ చేస్తున్న అలీపై లియాన్ సంపతీ చూపించాడు.
'మొయీన్ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తోంది. రెండేళ్లుగా టెస్టు క్రికెట్ ఆడకుండా సడెన్‌గా అన్ని ఓవర్లు బౌలింగ్ చేయడం అంటే మాటలు కాదు. అతని పరిస్థితిని ఒక్క మాటలో చెప్పాలంటే.. గొంతు పోయిన సింగర్.. స్టేజి మీద పెర్ఫామ్ చేయాల్సి వచ్చినట్లు ఉంది. ఇది వినడానికి వింతగా ఉన్నా అతని పరిస్థితి అలాగే ఉంది' అని చెప్పాడు.
ఈ సిరీస్‌కు ముందు అలీ ఐపీఎల్‌లో ఆడిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీ మొత్తం అతను కేవలం 26 ఓవర్లే బౌలింగ్ చేశాడు. కానీ యాషెస్ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్సులోనే 29 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో అతను వేలు బాగా దెబ్బతిన్నది. దానికి స్ప్రే కొట్టుకున్నందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం ఐసీసీ ఫైన్ కూడా వేసింది.
'ఫింగర్ స్పిన్నర్లు, ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లుగా బంతిని గ్రిప్ చేయడం చాలా కష్టం. మేం బంతి గ్రిప్‌పై వేళ్లు పెట్టి బంతిని స్పిన్ చేస్తాం. అప్పుడే మాకు స్పిన్ దొరుకుతుంది. అతనికి ఆ వేలికే గాయమైంది. నేను కూడా అలాంటివి ఎదుర్కొన్నా. ఎంత నొప్పిగా ఉంటుందో నాకు తెలుసు. అందుకే అతనిపై నాకు చాలా సింపతీ ఉందని అంటున్నా' అని లియాన్ చెప్పాడు.
స్పిన్నర్లు అందరూ తమ వేళ్లు బలంగా అవ్వడానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారు. కొందరేమో ఆల్కహాల్ మిక్సర్లలో తమ వేళ్లు ముంచుతారు. ఇంగ్లండ్ లెజెండరీ స్పిన్నర్ అయితే మూత్రంలో వేళ్లు ముంచేవాడు. మరి మీరేం చేస్తారని లియాన్‌ను అడగ్గా.. 'నేను హోటల్ రూంలో ఏం చేస్తానో అక్కడే వదిలేద్దాం. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు' అని స్పష్టం చేశాడు.