యాషెస్ సిరీస్ అంటేనే ఇంగ్లండ్ ఫ్యాన్స్‌కు ఉత్సాహం ఉరకలై పొంగుతుంది. ఆస్ట్రేలియాతో ఆ టీంకు ఉన్న వైరం అలాంటిది. క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ తర్వాత అంత వైరం ఈ రెండు జట్ల మధ్యనే అంటారు. అందుకే ఈ రెండు జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు తెగ క్రేజ్ ఉంటుంది. ఈ ఏడాది కూడా అదే జరిగింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులోనే ఆ విషయం స్పష్టం అయింది.
ఈ మ్యాచ్‌లో రెండు జట్ల ఆటగాళ్లు తమ ఎగ్రెషన్, ఆటతీరుతో అద్భుతంగా అలరిస్తున్నారు. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను తొలి ఇన్నింగ్స్‌లో అవుట్ చేసిన ఓలీ రాబిన్సన్ ఎంత ఎగ్రెసివ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నాడు తెలిసిందే. ఇక అది చూసిన తర్వాత ఇంగ్లిష్ ఫ్యాన్స్ ఊరికినే కూర్చుంటారా? వాళ్లు కూడా తమ ఎగ్రెషన్ చూపించారు.

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఆసీస్ స్టార్ స్టీవెన్ స్మిత్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేయడానికి వెళ్లాడు. అది కూడా ఆటగాళ్లను ఏడిపిస్తారని బాగా పేరున్న ఎరిక్ హోలీస్ స్టాండ్ వైపు స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. మరి అక్కడ ఉన్న ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఊరికినే కూర్చుంటారా? స్మిత్‌ను చూడగానే రెచ్చిపోయారు. అతన్ని ట్రోల్ చేస్తూ పాటలు పాడారు.
'స్టీవ్.. నువ్వు ఏడుస్తుంటే టీవీలో చూశాం' అంటూ ఇంగ్లండ్ ఫ్యాన్స్ పాటలు పాడారు. దీంతో ఈ పాటతో స్టేడియం అంతా దద్దరిల్లిపోయింది. ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న ఓలీ రాబిన్సన్‌కు ఇది చూసి నవ్వాగలేదు. అతను బలవంతంగా నవ్వు ఆపుకునే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
గతంలో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా ఆసీస్ టీం బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అలా చేసిన వాళ్లలో స్టీవ్ స్మిత్ కూడా ఉన్నాడు. ఈ ఘటన తర్వాత క్షమాపణలు చెప్పేందుకు మీడియా సమావేశానికి వచ్చిన స్మిత్.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాన్ని గుర్తు చేస్తూనే ఇంగ్లండ్ ఫ్యాన్స్ పాటలు పాడి అతన్ని ఎగతాళి చేశారు.