యాషెస్ సిరీసులో తొలి మ్యాచ్ ఎలా జరుగుతుందో దాన్ని బట్టే.. సిరీస్ టోన్ సెట్ అవుతుంది. ఎప్పుడూ ఎక్కువగా ఆసీస్ జట్టు ఎగ్రెసివ్‌గా ఉంటే.. ఇంగ్లండ్ కొంత వెనుకంజలో ఉంటుంది. కానీ ఈసారి ఆ రోల్స్ రివర్స్ అయ్యాయి. ఇంగ్లండ్ ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో రెచ్చిపోయింది. ఓడిపోయినా ఎనర్జీ లెవెల్స్ చూపించింది. ముఖ్యంగా ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ తన ఎగ్రెషన్ చూపించాడు.
ఉస్మాన్ ఖవాజా భారీ సెంచరీతో చెలరేగాడు. 141 పరుగులు చేసిన అతన్ని అవుట్ చేయడానికి ఇంగ్లండ్ కొత్త స్ట్రాటజీతో ఇబ్బంది పెట్టింది. ఈ సమయంలో బంతి అందుకున్న రాబిన్సన్ సూపర్ యార్కర్‌తో ఖవాజాను పెవిలియన్ చేర్చాడు. అలా అవుటవగానే ఖవాజా వైపు సీరియస్‌గా చూస్తూ సెండాఫ్ ఇచ్చాడు. అనంతరం తన ప్రవర్తన కరెక్టే అంటూ రికీ పాంటింగ్ కూడా స్లెడ్జింగ్ చేసేవాడని చెప్పాడు.

ఇలా రాబిన్సన్ చేసిన వ్యాఖ్యలు, చేష్టలపై మాజీ ఆసీస్ ఆటగాళ్లు విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఆసీస్ మాజీ లెజెండ్ మాథ్యూ హేడెన్ అయితే రాబిన్సన్‌ను తిట్టిపోశాడు. రాబిన్సన్ అంత గొప్ప క్రికెటర్ కాదని, ఈజీగా మర్చిపోయే ఆటగాడని హేడెన్ అన్నాడు. 'జో రూట్ బౌలింగ్‌కు రాగానే ప్యాట్ కమిన్స్ భారీ షాట్లతో విరుచుకుపడి, రెండు సిక్సర్లు బాదాడు. ఇంగ్లండ్‌ను ఎదుర్కోవాల్సింది అలాగే' అని హేడెన్ చెప్పాడు.
ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హేలీతో హేడెన్ మాట్లాడుతూ రాబిన్సన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'ఇక ఆ రెండో వాడు.. అసలు గుర్తే ఉండని ప్లేయర్. ఫాస్ట్ బౌలర్ అయ్యుండీ.. 124 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. కానీ నోరు మాత్రం చాలా పెద్దది' అన్నాడు హేడెన్. అతని మాటలు అర్థం కాని హేలీ.. 'ఎవరు ఓలీ రాబిన్సనా?' అని అడిగాడు.
'అలాంటి వాడి దగ్గరకు డైరెక్ట్‌గా వెళ్లి.. బ్రదర్, నేను నిన్ను వదిలిపెట్టను చూస్కో అని చెప్పేయాలి' అని హేడెన్ అన్నాడు. తాజాగా రికీ పాంటింగ్ కూడా రాబిన్సన్‌పై విమర్శలు చేశాడు. ఎప్పుడూ పదిహేనేళ్ల క్రితం తాను ఏదో చేశానని రాబిన్సన్ అన్నాడని, ఆ ఆలోచనల్లో ఉండబట్టే అంత చెత్త ప్రదర్శన చేశాడని ఎద్దేవా చేశాడు. ఆసీస్ ప్లేయర్లను విమర్శించాలంటే.. ఆటలో కూడా రాణించాల్సి ఉంటుందని అన్నాడు.