యాషెస్ సిరీస్ మంచి జోరుగా సాగుతోంది. ఈ సిరీస్‌లో రెండో టెస్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆసీస్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. వార్నర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో జట్టుకు భారీ స్కోరు అందించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సీనియర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ఇద్దరూ తేలిపోయారు.
కొత్త కుర్రాడు టంగ్, జో రూట్, ఓలీ రాబిన్సన్ బంతితో ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో మ్యాచ్ మధ్యలో జరిగిన ఒక ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఇంగ్లండ్‌లో ఆయిల్ నిరసనలు భారీగా జరుగుతున్నాయి. ఇలా నిరసనలు చేస్తున్న వారిలో ఒక వ్యక్తి.. లార్డ్స్‌లో మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి దూసుకొచ్చేశాడు. అతన్ని సెక్యూరిటీ అడ్డుకోలేకపోయింది.

అయితే మ్యాచ్‌లో కీపింగ్ చేస్తున్న ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్‌స్టో ఇది చూశాడు. మైదానంలోకి పరిగెత్తుకొచ్చిన ప్రొటెస్టర్‌ను చంకలో ఇరికించుకొని తీసుకెళ్లి బౌండరీ ఆవల సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాడు. అతను ఇలా ప్రొటెస్టర్‌ను చంటి పిల్లాడిలా ఎత్తుకొని వెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా స్పందించాడు. రెండో యాషెస్ టెస్టుకు ఇది మంచి ఆరంభం అంటూ అశ్విన్ జోకులు వేశాడు.
జానీ బెయిర్‌స్టో ఇలా నిరసనకారుడిని చంకలో ఇరికించుకొని వెళ్తున్న వీడియోపై అతను స్పందించాడు. ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన అశ్విన్.. 'రెండో టెస్టుకు మంచి ఆరంభం. అప్పుడే బెయిర్ స్టో భారీ బరువు ఎత్తేశాడు' అంటూ జోకులు వేశాడు. ఆసీస్ బ్యాటింగ్‌లో తొలి ఓవర్ ముగిసిన వెంటనే ఈ ఘటన జరగడం గమనార్హం. అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సెక్యూరిటీ మరింత టైట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.