
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ వేదికగా అతిథ్య ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌గా జరిగిన ఈ పోరులో అతిథ్య ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌పై 275 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ టెస్టు మ్యాచ్‌లో అనేక రికార్డులు నమోదయ్యాయి. అవేమిటంటే ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ ఆడిన గత 12 మ్యాచ్‌ల్లో ఏకంగా 11 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. కేవలం ఒకే ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అదే విధంగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ 21వ శతాబ్దంలో హిట్ వికెట్‌గా ఔటైన నాలుగో ఇంగ్లండ్ బ్యాటర్‌గా నిలిచాడు. డే అండ్ నైట్ టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాకు ఇది తొమ్మిదో విజయం. విశేషమేమిటంటే ఆస్ట్రేలియా ఇప్పటివరకు 9 డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే తొమ్మిదింటిలోనూ విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అలాగే ఈ మ్యాచ్‌లో 26 పరుగులు చేయడానికి జోస్ బట్లర్ ఆడిన బంతులు 207. 50 లేదా అంతకంటే తక్కువ పరుగులు చేసినప్పుడు ఇప్పటివరకు బట్లర్ ఎదుర్కొన్న అత్యధిక బంతులు ఇవే. అలాగే ఆస్ట్రేలియా పేస్ బౌలర్ రిచర్డ్సన్ తను ఆడిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా కెరీర్‌లో మొదటి సారి రిచర్డ్సన్ 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో కనీసం 200 బంతులు ఎదుర్కొని అత్యంత తక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. కాగా ఈ ఇన్నింగ్స్‌లో బట్లర్ కేవలం 12.56 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్‌గా నాథన్ లియాన్ ఇప్పటివరకు టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌పై 94 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో భారత్‌పై కూడా అతను 94 వికెట్లు పడగొట్టాడు. ఒక జట్టుపై లియాన్ పడగొట్టిన వికెట్ల సంఖ్య ఇదే అత్యధికం. ఈ మ్యాచ్‌లో 5/42 వికెట్లు తీయడం ద్వారా ఆస్ట్రేలియా పేసర్ రిచర్డ్‌సన్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌ల్లో ఐదవ అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ఏడో సారి ఔట్ చేశాడు. అయితే టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ స్టోక్స్‌ను ఏకంగా 11 సార్లు ఔట్ చేశాడు. ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అత్యధికంగా 39 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్‌కు ఏ గ్రౌండ్‌లోనైనా ఇవే అత్యధిక వికెట్లు. స్టార్క్ బ్రిస్టేన్‌లో 37 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్లేయర్ క్రిస్ వోక్స్ 44 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై అతనికి ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.