
మొదటి స్థానంలో బ్రాడ్‌మన్:
స్టీవ్ స్మిత్ అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 24వ సెంచరీ చేశాడు. కేవలం 118 ఇన్నింగ్స్‌లలో స్మిత్ 24వ సెంచరీ నమోదు చేసాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (123)ని అధిగమించాడు. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (66) ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (125) నాలుగో స్థానంలో ఉన్నాడు.

స్మిత్ సెంచరీ:
యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ తొలి రోజు ఆసక్తిగా ప్రారంభమైంది. ఇంగ్లండ్ పేసర్లు విజృంభించడంతో 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో స్మిత్ ఒంటరి పోరాటం చేయడంతో.. ఆస్ట్రేలియా 284 పరుగులు చేసింది. స్టువర్ట్ బ్రాడ్ (5/86), క్రిస్ వోక్స్ (3/58)లు చెలరేగారు. ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 10 పరుగులు చేసింది. బర్న్స్ (4), జేసన్ రాయ్ (6) క్రీజులో ఉన్నారు.

తొలిసారి ముగ్గురు:
2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సాండ్ పేపర్‌తో బాన్‌క్రాఫ్ట్ బంతిని రుద్దడం, ఇది వీడియోలో రికార్డు అవ్వడం జరిగిపోయింది. ఈ ఘటనలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ల పాత్ర ఉండడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ముగ్గురిపై ఏడాది నిషేధం విధించింది. నిషేధం అనంతరం స్మిత్, వార్నర్‌లు ఐపీఎల్, ప్రపంచకప్‌లలో ఆడాడు. ఇక యాషెస్-2019లో తొలిసారి ఈ ముగ్గురు టెస్టు మ్యాచ్ ఆడటం విశేషం.

శాండ్‌పేపర్ చూపిస్తూ:
గత నెలలో ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో వార్నర్, స్మిత్‌ను ఓ ఆటాడుకున్న ఇంగ్లండ్ అభిమానులు ఇప్పుడు యాషెస్‌లోనూ తమ ప్రతాపం చూపించారు. గురువారం తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభానికి ముందు జాతీయ గీతాలాపన కోసం ఆసీస్ ఆటగాళ్లు వస్తుండగా.. ట్యాంపరింగ్ కోసం వాడిన శాండ్‌పేపర్ చూపిస్తూ ఇంగ్లండ్ ప్రేక్షకులు హేళన చేశారు. వార్నర్, బాన్‌క్రాఫ్ట్ ఓపెనర్లుగా బరిలోకి వెళుతున్నప్పుడు ఇంగ్లిష్ అభిమానులు 'మోసగాళ్లు.. మోసగాళ్లు' అంటూ నినాదాలు చేశారు.


Click it and Unblock the Notifications












