
లండన్: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ సమం చేసింది. ఇంగ్లండ్ చివరి టెస్టులో ఘన విజయం సాధించి 2-2తో సమం చేసుకుంది. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (4/62), జాక్ లీచ్ (4/49) బౌలింగ్‌లో రాణించడంతో 135 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. 399 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. యాషెస్ సిరీస్ ముగియడంతో పలు కొత్త రికార్డులు నమోదవగా.. చెత్త రికార్డులు కూడా బద్దలు అయ్యాయి. తాజా యాషెస్ సిరీస్‌లో 113 ఏళ్ల చెత్త రికార్డు బద్దలు అయింది.
ఇంగ్లండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇరు జట్ల ఓపెనర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ముఖ్యంగా ఆసీస్ ఓపెనర్ల పరిస్థితి అయితే దారుణం. ఆదివారం చివరి రోజు ఆటలో ఆసీస్ ఓపెనర్లు మార్కస్ హారిస్ (9), డేవిడ్ వార్నర్ (11)లు విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో ఆసీస్-ఇంగ్లండ్ ఓపెనర్లు నమోదు చేసిన సగటు 12.55. దీంతో 113 ఏళ్ల చెత్త రికార్డు నమోదయింది. అంతకుముందు ఐదు అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్ల ఓపెనర్ల చెత్త రికార్డు సగటు 14.16 గా ఉండేది. 1906లో దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ రికార్డు నమోదైంది.
యాషెస్ సిరీస్ 2-2తో సమం అయినా.. స్వదేశంలో జరిగిన గత యాషెస్‌ను గెల్చుకున్నందున ట్రోఫీ ఆ్రస్టేలియా వద్దనే ఉండనుంది. దీంతో ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ నిలుపుకోవడం 18 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. గతంలో (2001) స్టీవ్ వా సారథ్యంలో ఆసీస్ ఇంగ్లండ్‌లో సిరీస్ గెలిచింది.
ఒక యాషెస్ సిరీస్ సమం కావడం 47 తర్వాత ఇదే తొలిసారి. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత అది పునరావృతం కావడం విశేషం. చివరిసారి 1972లో యాషెస్ సిరీస్ డ్రాగా ముగిసింది. అప్పుడు డ్రాగా ముగిసిన యాషెస్ కూడా ఇంగ్లండ్‌లోనే జరిగింది. ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ సిరీస్‌ను గెలిచి ఆసీస్‌కు చాలా కాలమే అయ్యింది. అయితే ఆసీస్‌కు ఈసారి ఆ అవకాశం అందినట్లే అంది చేజారింది.