
హైదరాబాద్: యాషెస్ సిరీస్‌లో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేని లోటు స‍్పష్టంగా కనబడిందని ఆ దేశ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 3-0తో తిరిగి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

పెర్త్ వేదికగా జరిగిన మూడో టెస్టులో పర్యాటక ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ 41 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాషెస్ సిరిస్‌లో ఇంగ్లాండ్‌కు ఇక వైట్ వాష్ మాత్రమే మిగులుందని ఆస్ట్రేలియాకు చెందిన క్రీడాభిమానులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లాండ్ జట్టులో బెన్ స్టోక్స్ లేకపోవడం వల్లే తమ జట్టు బలహీనపడిందని అన్నాడు. ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు ఉండగానే యాషెస్‌ను కోల్పోవడానికి కారణం జో రూట్, అలెస్టర్ కుక్‌లు విఫలం కావడమేనని స్వాన్ విమర్శించాడు.
ఈ సిరిస్‌లో మిగిలిన రెండు టెస్టుల్లో ఏ మాత్రం పోరాడే అవకాశం లేకుండా చేశారని పేర్కొన్నాడు. మరోవైపు మూడో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన యువ ఆటగాడు డేవిల్ మలన్‌పై స్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సిరీస్‌లో మిలన్ ఆట తీరు మినహా చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయిందని అన్నాడు.
'కొందరు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. డేవిడ్ మిలన్ ఆటతీరు నిజంగా అద్భుతం. క్రికెట్‌లో తానింత వరకు చూడనటువంటి బంతికి జేమ్స్ విన్స్ ఔటయ్యాడు. తమ జట్టులో స్టోక్స్ లేకపోవడం వల్ల తొలి మూడు గేమ్‌ల్లోనే సిరీస్‌ను కోల్పోతుందనే విషయాన్ని ముందే అంచనా వేశా' అని స్వాన్ అన్నాడు.
కాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో బ్రిస్టల్‌లోని ఓ నైట్ క్లబ్‌లో జరిగిన గొడవ కారణంగా ఇంగ్లాండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు యాషెస్ టెస్టు సిరిస్ నుంచి బెన్ స్టోక్స్‌ని తప్పించిన సంగతి తెలిసిందే. పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలు కావడంతో సిరిస్‌ను ముందుగానే సమర్పించుకుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.