విశాఖపట్నం: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తన క్రికెట్ కెరీర్‌లో 50వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ 14వ టెస్టు సెంచరీని సాధించాడు.
తన టెస్టు కెరీర్‌లో కెప్టెన్‌గా కోహ్లీకి ఇది 7వ సెంచరీ. అంతేకాదు ఈ ఏడాదిలో కోహ్లీ మూడో సెంచరీని సాధించాడు. కోహ్లీ కెప్టెన్‌గా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేశాడు. ఈ క్రమంలో భారత్ తరుపున టెస్టు కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన వారిలో కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు.

11 సెంచరీలతో గవాస్కర్ మొదటి స్ధానంలో ఉండగా, అజారుద్దీన్ 9 సెంచరీలతో రెండో స్ధానంలో ఉన్నాడు. అయితే సచిన్ టెండూల్కర్, కోహ్లీలు కెప్టెన్‌గా 7 సెంచరీలతో సమంగా ఉన్నారు. కాగా, విశాఖలో జరుగుతున్న రెండో టెస్టులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
జట్టు స్కోరు 6 పరుగుల వద్ద కేఎల్ రాహుల్(0), 22 పరుగుల వద్ద మురళీ విజయ్(20) ఔట్ కావడంతో కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ కోహ్లీ, పుజారాతో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి అజేయంగా 226 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇంగ్లాండ్‌పై మూడో వికెట్‌కు 150 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేయడం 14 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. 2002లో సచిన్ టెండూల్కర్ - రాహుల్ ద్రవిడ్‌ల జోడి హెడింగ్లీలో జరిగిన టెస్టులో 150 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యాన్ని ఇంగ్లాండ్‌పై చివరిసారి సాధించింది.
కోహ్లీ టెస్టు కెరీర్ ప్రత్యేకతలివే:
* 49 టెస్టుల్లో 84 ఇన్నింగ్సులు ఆడాడు
* అత్యధిక వ్యక్తిగత పరుగులు 211
* మొత్తం పరుగులు 3,643
* టెస్టుల్లో యావరేజి 46.11. ఇక స్ట్రయిక్ రేట్ 53.69
* కెప్టెన్‌గా యావరేజి 55.17
* సెంచరీలు 14, డబుల్ సెంచరీలు 2, అర్ధ సెంచరీలు 12
* 50 పరుగులకుపైగా చేసినప్పుడు గెలిచిన మ్యాచ్‌లు 9
* టెస్టు కెప్టెన్‌గా వరుసగా నాలుగు సిరీస్‌లు కైవసం