
ముంబై: ఆగస్టులో భారత్-దక్షిణాఫ్రికా పర్యటన గురించి హామీ ఇవ్వలేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. కేవలం అవకాశాలపై చర్చలు మాత్రమే జరిగాయన్నారు. పర్యటనకు బీసీసీఐ అంగీకరించిందన్న దక్షిణాఫ్రికా క్రికెట్ సంఘం ప్రకటనతో అరుణ్ ధుమాల్ విభేదించారు. ఆగస్టులో దక్షిణాఫ్రికాలో మూడు టీ20లు ఆడేందుకు బీసీసీఐ అంగీకరించిందని దక్షిణాఫ్రికా క్రికెట్ సంఘం సీఈవో జాక్వెస్ ఫాల్, డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే జాక్వెస్ ఫాల్, గ్రేమ్ స్మిత్ చేసిన వ్యాఖ్యలను అరుణ్ ధుమాల్ అంగీకరించలేదు. 'కరోనా కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్ వాయిదా పడటంతో.. మ్యాచుల నిర్వహణకు అవకాశాలపై మేం చర్చించాం. పర్యటనకు కృషి చేస్తామని చెప్పాం.అయితే ఆగస్టులో పర్యటనపై మేం హామీ ఇవ్వలేదు. జులైలో శ్రీలంక, జింబాబ్వేల్లో పర్యటనలపైనా మేం హామీ ఇవ్వలేదు. ఈ రెండూ భవిష్య ప్రణాళిక (ఎఫ్‌టీపీ)లో భాగమే. అవే కుదరనప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాకు ఎలా మాటిస్తాం' అని ధుమాల్ అన్నారు.
ఐసీసీ ఛైర్మన్‌గా సౌరవ్ గంగూలీకి గ్రేమ్ స్మిత్ మద్దతు ప్రకటించడంపై అరుణ్ ధుమాల్ స్పందించారు. 'ఐసీసీ ఛైర్మన్ షిప్‌పై బీసీసీఐ ఇంకా అధికారిక చర్చ జరగలేదు. గ్రేమ్ స్మిత్ తన సొంత అభిప్రాయం చెప్పాడు. అది సీఎస్‌ఏ వైఖరి కాదు. అంతర్జాతీయ కమిటీకి భారతీయుడు నేతృత్వం వహిస్తే మా అందరికి ఇష్టమే. అయితే మేమింకా దానిపై చర్చించలేదు' అని పేర్కొన్నారు.
'దక్షిణాఫ్రికాతో మేం కచ్చితంగా సిరీస్ ఆడతాం. అయితే అది షరతులకు లోబడే ఉంటుంది. ఐసీసీ విధానాలపై భారత వైఖరికి సీఎస్‌ఏ మద్దతును బట్టే ఉంటుంది. టీ20 ప్రపంచకప్ వాయిదా పడాలని మేమెందుకు కోరుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీ స్టేడియాల్లో అన్ని జట్లతో నిర్వహణ సాధ్యమేనా అన్నది ఆలోచించుకోవాలి. నిర్ణయం ఐసీసీ, ఆస్ట్రేలియా కలిసే తీసుకుంటాయి' అని బీసీసీఐ కోశాధికారి చెప్పుకొచ్చారు.
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌కి ముందు టీంఇండియా చివరిగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడాల్సింది. అయితే మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లను కరోనా వ్యాప్తి కారణంగా రద్దు చేశారు. ఆపై ఓ వారం తర్వాత ప్రొటీస్ జట్టు స్వదేశానికి పయనమైంది.