
హైదరాబాద్: కశ్మీరి ప్రజలకు సంఘీభావంగా పాకిస్థాన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మీ చేపట్టే నిరసన కార్యక్రమంలో తాను పాలుపంచుకుంటానని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన ట్వీట్‌పై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించాడు.
ఈ సందర్భంగా గురువారం ప్రముఖ వార్తా సంస్థ ఎఎన్ఐకి ఇచ్చిన ఇంటర్యూలో గంభీర్ మాట్లాడుతూ "కొంతమంది ఎప్పటికీ ఎదగరు. వాళ్లు క్రికెట్ ఆడుతారు కానీ, వాళ్లకు వయసు పెరగదు. అఫ్రీది లాంటి ఆటగాళ్లకు బుద్ధి పెరగలేదు" అని అన్నాడు. అయితే గంభీర్-అఫ్రిది మధ్య మాటల యుద్ధం జరగడం ఇదే మొదటిసారి కాదు.
కశ్మీరీ ప్రజలకు సంఘీభావంగా ప్రతీ శుక్రవారం 'కశ్మీర్ అవర్' పేరిట ఓ కార్యక్రమం చేపడతామని పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. యువత నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని అఫ్రీదీ తన ట్విట్టర్‌లో కోరారు. ఈ నేపథ్యంలో గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు.
ఆగస్టు 30వ తేదీన శుక్రవారం 12 గంటలకు 'కశ్మీర్ అవర్' పేరిట సంఘీభావం కోసం సైరన్ మోగిస్తాం. ఈ నిరసన కార్యక్రమంలో పాక్ ప్రజలందరూ పాల్గొనాలని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ప్రకటించారు. పాక్ ఆర్మీ ప్రకటన అనంతరం కశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా చేపట్టనున్న నిరసనలో తాను కూడా పాల్గొంటానని అఫ్రీది అన్నాడు.
ఈ మేరకు ట్విట్టర్‌లో "ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపుకు మద్దతు ఇద్దాం. శుక్రవారం మధ్యా హ్నం 12 గంటలకు మజర్ ఈ ఖైద్ (జిన్నా సమాధి)ని సందర్శిస్తా. కశ్మీరీ ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు నాతో చేతులు కలపండి. సెప్టెంబర్ 6న ఓ అమర జవాన్ ఇంటికి వెళతా. త్వరలో ఎల్‌వోసీకి కూడా వెళతా" అంటూ ట్వీట్ చేశాడు.