
హైదరాబాద్: బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ నిర్ణయం అందరినీ నిరుత్సాహానికి గురి చేసింది. మరి కొద్ది రోజుల్లో ఆరంభంకానున్న ముంబై టీ20లీగ్ నుంచి అతను తప్పుకుంటున్నాడు. ఎడమచేతి వాటం ఫేసర్ అయిన అర్జున్ తన బౌలింగ్ శైలిని మార్చుకునే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో టోర్నమెంట్‌కు సిద్ధంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.
సచిన్‌తో సుధీర్ఘంగా చర్చించిన తరువాతే లీగ్‌పై 18ఏళ్ల అర్జున్ తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనవరి 8 నుంచి అర్జున్ తన బౌలింగ్ శైలిపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నాడు. విశేషమేంటంటే ముంబై టీ20 లీగ్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌కు వ్యవహరిస్తున్నారు. ఈ లీగ్ మార్చి 11 నుంచి 21 వరకు జరగనుంది.
లీగ్‌లో తొలుత అర్జున్ ఆడతాడని తెలియడంతో అందరి దృష్టి యువ క్రికెటర్‌పైనే పడింది. అతని నిష్క్రమణతో నిర్వాహకులు నిరుత్సాహపడ్డారు. సచిన్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న అర్జున్ ఉంటే లీగ్‌కు ప్రత్యేక ఆదరణ ఉంటుందని ఆర్గనైజర్లు భావించారు. ముంబైకి చెందిన టాప్ క్రికెటర్లు శ్రీలంకలో పర్యటించే టీమిండియా జట్టులో ఉండటం..మరికొంత మంది నాగ్‌పూర్‌లో జరిగే ఇరానీ కప్‌లో పాల్గొంటుండంతో చాలా వరకు సీనియర్ ఆటగాళ్లు లీగ్‌కు దూరమవుతున్నారు.
అర్జున్ టెండూల్కర్ కోచ్ అతుల్ గైక్వాడ్ మాట్లాడుతూ.. 'అతనిలో రెండేళ్ల నుంచి శారీరక మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతని ఆటతీరుకు అది ఆటంకంగా మారింది. అదే గాక, బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో అతను ముంబై టీ20 లీగ్‌కు అందుబాటులో ఉండట్లేదు' అని పేర్కొన్నాడు.