
ముంబై :టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారు అర్జున్ టెండూల్కర్ శుక్రవారం ముంబై సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హర్యానాతో జరిగిన మ్యాచ్లో అర్జున్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతడు ఓ వికెట్ కూడా పడగొట్టాడు. గ్రూప్-ఇలో భాగంగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ముంబై, హర్యానా జట్లు తలపడ్డాయి. ఇప్పటి వరకు అండర్-19 మ్యాచ్‌లు ఆడిన అర్జున్.. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పైన కూడా గురిపెట్టినట్లు సమాచారం తెలుస్తోంది.
ముస్తాక్ అలీ టోర్నీ 20-20 ఫార్మాట్‌లో జరుగుతోంది. ఈ టోర్నీలో శుక్రవారం ముంబై తన మూడవ మ్యాచ్ ఆడింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ టోర్నీ కోసం 20 మంది సభ్యులు ఉన్న జట్టును ఇటీవల ప్రకటించింది. దాంట్లో అర్జున్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో జట్టు సభ్యుల సంఖ్యను పెంచేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. దీంతో ముంబై సీనియర్ జట్టులో అర్జున్‌కు స్థానం ఖరారైంది.
మొదటి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం అర్జున్ టెండూల్కర్‌కు చోటు దక్కలేదు. 21ఏళ్ల అర్జున్ ఇప్పటి వరకు ఏజ్ గ్రూప్ టోర్నీల్లోనే ఆడాడు. ముంబై జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ముంబై అర్జున్ మొదట 2017లో ముంబై అండర్ -19 జట్టులోకి ప్రవేశించి, ఆ తరువాత సంవత్సరం భారత్ అండర్-19 జట్టులో ఆడాడు.
హర్యానాతో జరిగిన మ్యాచ్లో 21 ఏళ్ల ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 34 పరుగులు ఇచ్చాడు. ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయిన హర్యానా.. ఆ తర్వాత బాగా పుంజుకుంది. 17.4 ఓవర్లలో 144 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. దీంతో హర్యానా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి దూసుకొచ్చింది. ముంబై మూడు ఓటములతో రేసు నుంచి దాదాపు తప్పుకుంది. ఇక చివరి రెండు మ్యాచ్‌లకు అర్జున్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకుంటాడని అందరూ భావిస్తున్నారు.