
హైదరాబాద్: లార్డ్స్ మైదాన సిబ్బందికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సాయపడ్డాడు. దీంతో అతడిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలే శ్రీలంక పర్యటన ముగించుకుని అర్జున్ టెండూల్కర్ తిరిగి లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఎంసీసీ యువ ఆటగాళ్లతో పాటు శిక్షణ తీసుకుంటున్నాడు.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు లార్డ్స్ వేదికగా ప్రారంభంకావాల్సి ఉంది. అయితే, ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం కారణంగా తొలి రోజు కనీసం టాస్ కూడా పడకుండా ఆట రద్దయ్యింది. రెండో రోజు శుక్రవారం టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
భారత్ బ్యాటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికీ వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో పలుసార్లు ఆటకు విరామం కలిగింది. వర్షానికి పిచ్ తడవకుండా ఉండేందుకు గాను గ్రౌండ్ స్టాఫ్ ప్రత్యేక సాంకేతిక పరికరాన్ని తీసుకువచ్చి కవర్లతో కప్పుతూ వచ్చారు. ఆ సమయంలో అర్జున్ గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి మైదానంలో శ్రమించడం పలువురిని ఆకట్టుకుంది.
రెండో రోజు మ్యాచ్ అనంతరం మైదానం నిర్వాహకులు ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. "ఇక్కడ అర్జున్ ఎంసీసీ ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాదు, మైదాన సిబ్బందికి చేదోడువాదోడుగానూ నిలిచాడు" అని పేర్కొన్న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ అర్జున్‌ను అభినందిస్తూ ఫొటోను అభిమానులతో పంచుకుంది.
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రెండో రోజు శుక్రవారం కూడా మ్యాచ్ మధ్యలో చాలాసార్లు వరుణుడు అంతరాయం కలిగించాడు. పిచ్‌ను కవర్లతో కప్పేందుకు గ్రౌండ్ సిబ్బంది చాలా ఇబ్బందిపడ్డారు.
జులైలో భారత అండర్-19 జట్టుతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన అర్జున్ అక్కడే ఉండి ఎంసీసీ యంగ్ క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే లార్డ్స్ టెస్టు ఆరంభానికి ముందు భారత ఆటగాళ్లు నెట్స్‌లో అర్జున్‌తో బౌలింగ్ వేయించుకుని ప్రాక్టీస్ చేసిన సంగతి తెలిసిందే.