వాటర్ బాయ్‌గానే మిగిలిపోయాడు.. అదే అతని కొంపముంచిందా?
ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. టోర్నీలో జట్టు కోల్పోవడానికి ఏమీ లేనప్పుడు.. సాధారణంగా ఏ జట్టైనా తమ బెంచ్ బలాన్ని పరీక్షిస్తుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ప్లేయర్లకు అవకాశాలు ఇస్తుంది. కానీ లక్నో జట్టుకు ఈ పరిస్థితి వచ్చినప్పటికీ అందరి కళ్లు ఒకే ఒక్క ఆటగాడిపైనే నిలిచాయి. ఆ ఆటగాడు మరెవరో కాదు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్. లక్నో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నా కూడా అర్జున్ టెండూల్కర్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
అర్జున్ టెండూల్కర్‌కు ఛాన్స్ రాకపోవడం అనేది కేవలం ఓ సాధారణ సెలక్షన్ సమస్య మాత్రమే కాదు. దీని వెనుక ఓ ప్లేయర్ కెరీర్‌ను శాసిస్తున్న ఓ భారీ వారసత్వ ఒత్తిడి దాగుంది. ఇండియాలో టెండూల్కర్ అనేది కేవలం ఓ ఇంటిపేరు కాదు.. అది ఈ దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సామ్రాజ్యం. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కొడుకు కావడమే అర్జున్ కెరీర్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్ అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే అదే పేరు ఇప్పుడు అర్జున్ పాలిట ఓ మోయలేని కొండలా, కెరీర్‌కు ఓ అడ్డంకిలా మారింది. క్రికెట్ మైదానంలో ప్రదర్శన కంటే కూడా అతని పేరు చుట్టూ జరిగే చర్చలే ఎక్కువయ్యాయి.

సాధారణంగా ఏ యువ ఆటగాడైనా విఫలమైతే, తప్పులు సరిదిద్దుకుని మళ్లీ పుంజుకోవడానికి తగిన సమయం, అవకాశాలు దక్కుతాయి. కానీ అర్జున్ టెండూల్కర్ విషయంలో కథ ముందు నుంచి కాస్త భిన్నంగానే ఉంది. అర్జున్ టెండూల్కర్ మైదానంలోకి అడుగు పెట్టకముందే సోషల్ మీడియాలో, విశ్లేషకుల్లో ఓ బలమైన అభిప్రాయం ఏర్పడిపోతుంది. గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం వచ్చినప్పుడు అది కేవలం అర్జున్ టెండూల్కర్ ప్రతిభ వల్లే వచ్చిందా లేక సచిన్ కొడుకు అనే బ్రాండ్ వల్ల వచ్చిందా అనే వివాదం నడిచింది. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో అసలు అవకాశమే రాకపోయేసరికి.. మళ్లీ అదే పేరు చర్చల్లోకి వచ్చింది. అంటే అర్జున్ ఆడినా, ఆడకపోయినా వివాదాలు అతడిని వదలడం లేదు.
అర్జున్ టెండూల్కర్ అంత గొప్పగా ఏమీ రాణించకపోవడం గమనార్హం. అర్జున్ ఖాతాలో కొన్ని మ్యాచ్‌లు, కొన్ని వికెట్లు, ఓ సాధారణ ఎకానమీ రేట్ మాత్రమే ఉన్నాయి. అయితే మిగిలిన యువ ప్లేయర్లను అంచనా వేసినట్లు అర్జున్‌ను ఎవరూ చూడటం లేదు. అతని వేసే ప్రతి ఓవర్, ప్రతి బంతిని ఓ తుది తీర్పులా విశ్లేషిస్తున్నారు. అర్జున్ టెండూల్కర్ ఒక మ్యాచ్‌లో బాగా బౌలింగ్ చేస్తే దాన్ని 'యాదృచ్ఛికం' అని.. ఒక ఓవర్ చెత్తగా వేస్తే దాన్ని 'అసలు నిజం' అని తేల్చేస్తున్నారు. ఈ స్థాయి ఒత్తిడి ఏ యువ క్రికెటర్ ఆత్మవిశ్వాసంనైనా దెబ్బతీస్తుంది. జనాలు ఓ క్రికెటర్‌ను చూడటం మర్చిపోయి, కేవలం అతని వెనుక ఉన్న 'టెండూల్కర్' అనే పేరును మాత్రమే చూస్తున్నారు.
నిజానికి అర్జున్ టెండూల్కర్ ఓ లెఫ్టార్మ్ పేసర్. అర్జున్ టెండూల్కర్ ఆట తీరు, శైలి వేరు. కానీ జనాలు 'టెండూల్కర్' అనే పేరు వినగానే బ్యాట్ ఊపడం గురించే ఆలోచిస్తారు కానీ, బాల్ వేయడం గురించి కాదు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తీసుకున్న ఈ తాజా నిర్ణయం అర్జున్ ఎదుర్కొంటున్న మానసిక పోరాటాన్ని స్పష్టం చేస్తోంది. అర్జున్ చేస్తున్న పోరాటం ప్రత్యర్థి బ్యాటర్లతో కాదు, సమాజంలో ఉన్న ముందస్తు అభిప్రాయాలతో. అతను ఎవరి నీడలోనో బతకాలని అనుకోవడం లేదు, తనకంటూ ఓ సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. భవిష్యత్తులో అర్జున్ గొప్ప ఆటగాడు అవుతాడా లేదా అనేది పక్కన పెడితే.. ఇండియాలో ఓ ఆటగాడిని కేవలం ఆటగాడిగా మాత్రమే చూసే రోజు ఎప్పుడు వస్తుందనే పెద్ద ప్రశ్నను ఈ ఘటన మిగిల్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications