
లండన్: 6 బంతుల్లో 6 సిక్సర్లు అనగానే మనకు టక్కున గుర్తొచ్చే ప్లేయర్.. టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ సిక్సర్ల మోత మోగించాడు. ఆ తర్వాత ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లను చాలా మందే బాదారు. విండీస్ హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్, శ్రీలంక ఆటగాడు తిసార పెరీరా ఈ సంవత్సరంలోనే ఒకే ఓవర్లో ఆరు బంతులను మైదానం వెలుపలకు పంపారు. ఐపీఎల్ 14వ సీజన్‌లో రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో ఐదు వరుస సిక్సర్లు బాది.. ఆఖరి బంతికి ఫోర్ కొట్టడంతో తృటిలో రికార్డును మిస్ అయ్యాడు.
అయితే రవీంద్ర జడేజా తృటిలో అరుదైన రికార్డు కోల్పోయినా.. ఈసారి అరితరన్ వసీకరణ్ అద్భుతం చేశాడు. యూరోపియన్ క్రికెట్ డొమెస్టిక్ లీగ్‌లో వసీకరణ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. ఈసీఎస్ టీ10 పేరిట జరుగుతున్న టోర్నీలో శుక్రవారం బేయర్ ఉర్డింజిన్ బూస్టర్స్ , కోన్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. బేయర్ ఉర్డింజిన్ బ్యాట్స్‌మన్ అరితరన్ వసీకరణ్.. ఆయుష్ శర్మ బౌలింగ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో ఈ మ్యాజిక్ చోటుచేసుకుంది.
ఆయుష్ శర్మ వేసిన ఆరు బంతులను అరితరన్ వసీకరణ్ వరుసగా.. మిడ్ వికెట్, మిడ్ వికెట్,స్క్వేర్‌లెగ్, మిడ్ వికెట్, స్క్వేర్‌లెగ్, మిడాన్ దిశగా ఆరు సిక్సులను బాదాడు. అతను క్రీజులోకి వచ్చేసరికి జట్టు స్కోరు 4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 21 పరుగులతో ఉంది. వరుసగా ఆరు సిక్సులు బాదడంతో బూస్టర్స్ స్కోరు 5 ఓవర్లలో 57/3గా నమోదైంది. మొత్తంగా వసీకరణ్ 25 బంతులెదుర్కొని 61 పరుగులు చేశాడు. అరితరన్ తన ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు, 3 బౌండరీలు బాదాడు. దీంతో బూస్టర్స్ 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.
6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన క్లబ్‌లో 10వ ఆటగాడిగా అరితరన్ వసీకరణ్ చోటు దక్కించుకున్నాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్ వెస్టిండీస్‌కు చెందిన సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కాగా.. అతను 1968లో ఈ ఘనత సాధించాడు. సోబర్స్ తర్వాత రవిశాస్త్రి (1985), హెర్షెల్ గిబ్స్ (2007), యువరాజ్ సింగ్ (2007), రాస్ వైట్లీ (2017), హజ్రతుల్లా జజాయ్ (2018), లియో కార్టర్ (2020), కీరోన్ పొలార్డ్ (2021), తిసారా పెరీరా (2021), అరితరన్ వసీకరణ్ (2021) 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదారు.