సిడ్నీ: ఆస్ట్రేలియా, భారత్ మధ్య గురువారం జరిగే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠను రేపుతున్న సమయంలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ సిడ్నీ చేరుకుంది. గురువారం జరిగే సెమీ ఫైనల్ మ్యాచులో ఆమె సందడి చేయనుంది.
తన బాయ్ ఫ్రెండ్ విరాట్ కోహ్లీకి, టీమిండియాకు మద్దతు ఇచ్చేందుకు ఆ భామా మణి సిడ్నీలో వాలింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సేన సెమీ ఫైనల్‌కు చేరుకున్న నేపథ్యంలో జట్టు సభ్యుల భార్యలు, ప్రియురాళ్లు వారితో ఉండేందుకు బిసిసిఐ అనుమతి ఇచ్చింది.

సిడ్నీలో దిగిన అనుష్క విరాట్ కోహ్లీతో కలిసి షికార్లు చేసేస్తోందని టెలిగ్రాఫ్ పత్రిక రాసింది. టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి ఆ విరాట్ కోహ్లీ, అనుష్క జంట భారతీయ రెస్టారెంట్‌లో భోజనానికి వెళ్లిందని ప్రచారం సాగుతోంది. ఎన్‌హెచ్ 10 సినిమాలో అనుష్క నటను వారంతా ప్రశంసించారని అంటున్నారు.
గతంలో ఓసారి విరాట్ కోహ్లీ స్టాండ్స్‌లో ఉన్న తన ప్రేయసి అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి సంచలనం సృష్టించాడు. సిడ్నీ స్టేడియంలో మరోసారి కోహ్లీకి తన ప్రేయసికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చే అవకాశాన్ని తీసుకుంటాడా, లేదా అనేది చూడాలి.