న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన ప్రియుడు విరాట్ కోహ్లీతో గడుపుతున్నారు! ఆంగ్ల మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. అనుష్క శర్మ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆమె ఈ నెల 3వ తేదీన జరగనున్న సురేష్ రైనా పెళ్లికి హాజరుకానున్నారు. రైనా చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంకను వివాహం చేసుకోనున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న అనుష్క శర్మ తన ప్రియుడు విరాట్ కోహ్లీ ఇంటికి వెళ్లారు. మీర్ బేగ్‌లోని కోహ్లీ ఇంటికి వెళ్లి, వారి కుటుంబంతో గడిపారని సమాచారం. అంతేకాదు, సోమవారం రాత్రి ఓ మంచి రెస్టారెంటుకు వెళ్లి భోజనం చేశారట.
వారు డిన్నర్‌కు వెళ్తున్న సమయంలో అభిమానుల హంగామా కూడా కనిపించిందట. వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. విరాట్ కోహ్లీ ఇంటికి అనుష్క రాక నేపథ్యంలో కోహ్లీ ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని సమాచారం. కాగా, ఇటీవల ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చిన అనుష్క, కోహ్లీలు చేతిలో చేయి వేసుకొని ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించిన విషయం తెలిసిందే.

అనుష్క శర్మ ఆగ్రహం?
ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో విరాట్ కోహ్లీ విఫలం పైన అనుష్క శర్మ పైన విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందించారని వార్తలు వస్తున్నాయి. విరాట్ ఆడినా, ఆడకున్నా తనతో ముడిపెట్టాలని చూస్తున్నారని ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.
తాను సిడ్నీ నుండి తిరిగొచ్చాక బ్యాక్ పెయిన్ కారణంగా ముంబైలోని ఆసుపత్రికి వెళ్లడం పైన ఊహాగానాలు వినిపిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్‌హెచ్ 10 సినిమా చేస్తున్నప్పుడు వెన్నునొప్పి వచ్చిందని, అప్పట్నుండి తీరిక లేక ఆసుపత్రికి వెళ్లలేదని, ఇప్పుడు వెళ్లానని చెప్పారు. ఆస్ట్రేలియా టూర్‌కు, తన బ్యాక్ పెయిన్‌కు లింకేమిటని చెప్పారు.