ముంబై: అనుష్క-విరాట్ కోహ్లీ ప్రేమ జంటకు మీరు గనుక అభిమానులైతే మీకు సంతోషం కలిగించే వార్త ఇది. టీమిండియా టెస్టు కెప్టెన్, బాలీవుడ్ నటి అనుష్క శర్మల ప్రేమాయణం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగలడంతో అభిమానులు కాస్తంత నిరాశ చెందిన సంగతి తెలిసిందే.
సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'సుల్తాన్' లో నటించొద్దని విరాట్ కోహ్లీ చెప్పినప్పటికీ, అనుష్క అతని మాటను పట్టించుకోక పోవడంతో, వారిద్దరి మధ్య మాటామాట పెరిగి విడిపోయారంటూ ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అనుష్క సోదరుడు రంగంలోకి దిగి మళ్లీ వారిద్దరినీ కలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగా ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి అనుష్క ఫోన్ చేసి అభినందనలు తెలిపిందని వార్తలు వస్తున్నాయి. అయితే విరాట్ మళ్లీ తిరిగి తన ప్రేయసి ప్రేమను దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు విరాట్ అనుష్కను మళ్లీ తన జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటున్నాడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ కార్యక్రమంలో విరాట్ 'తాజ్‌మహల్' చిత్రం నుంచి 'జో వాదా కియా.. వో నిభానా పడేగా..'(మాట ఇచ్చినప్పుడు కట్టుబడి ఉండాలి) పాట ఆమెపై ప్రభావం చూపిందని అంటున్నారు.