
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-బాలీవుడ్ నటి అనుష్క శర్మల పెళ్లిపై అనుష్క మేనేజర్ స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ వీరిద్దరి వివాహంపై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా వచ్చే వారంలో వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నారనే వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజాగా అనుష్క శర్మ ఇటలీ వెళ్లేందుకు ముంబైలో విమానాశ్రయానికి వచ్చింది. గురువారం అర్ధరాత్రి అనుష్కశర్మ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కుటుంబ సభ్యులతో దర్శనమిచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మీడియా ఆమెను పెళ్లిపై ప్రశ్నించగా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయింది.
అనుష్క పక్కనే ఆమె తల్లిదండ్రులు కల్నల్ అజయ్‌కుమార్, అషిమా శర్మ, సోదరుడు కర్నేష్ కూడా ఉన్నారు. నిజానికి డిసెంబర్ 12వ తేదీన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ఇటలీలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని అనుష్క శర్మ మేనేజర్ ఖండించాడు.
మరోవైపు కోహ్లీ కూడా శ్రీలంకతో డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరిస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల పెళ్లిన నేపథ్యంలోనే కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ సెలవు పెట్టారంటూ మరో వార్త కూడా వచ్చింది.
రాజ్‌కుమార్.. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అండర్-23 కోచ్‌గా ఉన్నారు. వచ్చే వారం ఢిల్లీకి తమిళనాడుతో కీలకమైన మ్యాచ్ ఉంది. అయినా సరే రాజ్ కుమార్ సెలవు పెట్టాడు. కుటుంబ కారణాలతో సెలవు పెడుతున్నానని రాజ్‌కుమార్ చెప్పినప్పటికీ కోహ్లీ-అనుష్కల పెళ్లి కోసమే అతడు సెలవు పెట్టాడంటూ వార్తలు వస్తున్నాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.