
హైదరాబాద్: భారతీయులంతా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో 'హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్' అనే ఛాలెంజ్‌కు రెండు రోజుల క్రితం కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ను సవాల్‌గా తీసుకొని వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ విసిరిన 'హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్' ఛాలెంజ్‌ను విరాట్ కోహ్లీ, సైనా నెహ్వాల్, హృతిక్ రోషన్ ఈ ఫిట్‌నెస్ సవాలును స్వీకరించిన సంగతి తెలిసిందే. ఫిట్‌గా ఉండేందుకు సాధన చేస్తోన్న వీడియోను పోస్టు చేసిన కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెటర్ మహేంద్ర సింగ్‌ధోనీ ఈ సవాలును స్వీకరించాల్సిందిగా కోరాడు.
విరాట్ కోహ్లీ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జిమ్‌లో కసరత్తులు చేసిన వీడియోని తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అంతేకాదు ఈ సందర్భంగా ఆమె దీపికా పల్లికల్, వరుణ్ ధావన్‌లను ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా ట్విట్టర్‌లో కోరింది.
మరోవైపు కోహ్లీ విసిరిన సవాల్‌కు ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'నీ సవాలును స్వీకరిస్తున్నాను. త్వరలోనే నా ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియోను పంచుకుంటాను' అని మోడీ తన ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఇక, కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ విసిరిన 'హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్' ఛాలెంజ్‌ను స్వీకరించిన సైనా నెహ్వాల్ తను కసరత్తులు చేసే వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ ఛాలెంజ్‌ని దగ్గుబాటి రానాతో పాటు క్రీడాకారులు పీవీ సింధు, గౌతమ్ గంభీర్‌లను స్వీకరించాల్సిందిగా కోరింది.
సైనా నెహ్వాల్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన పీవీ సింధు జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న వీడియోని తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అనంతరం బాలీవుడ్ నటి, దీపికా పదుకొణె, టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని, జ్యోష్న పొన్నప్పలను ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరింది.
పీవీ సింధు ఛాలెంజ్‌ను స్వీకరించిన అఖిల్ అక్కినేని తాను జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఛాలెంజ్‌ని స్వీకరించాల్సిందిగా మరో నలుగురికి కోరాడు. ఇందులో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, వరుణ్ ధావన్ ఉన్నారు. వీరిలో నాగచైతన్య ముందుగా స్పందించి తన ఫిట్ నెస్ వీడియో షేర్ చేశాడు.