న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడే అవకాశాల్లేవని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పాడు. ఇంత తక్కువ సమయంలో సిరీస్‌కు ఏర్పాట్లు చేయడం పిసిబికి అసాధ్యమైన పని అని తెలిపాడు.
''ఇంత తక్కువ సమయంలో సిరీస్‌కు ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం ఒకవేళ వచ్చే వారం సిరీస్‌కు అనుమతిచ్చినా సిరీస్‌కు ఏర్పాట్లు చేయడం దాదాపు అసాధ్యం' అని అనురాగ్ ఠాకూర్ చెప్పాడు.
అంతేగాక, జనవరిలో పాకిస్థాన్.. న్యూజిలాండ్‌లో, ఇండియా.. ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉందని తెలిపాడు.

టీ20 ప్రపంచ కప్ వరకు ధోనీనే కెప్టెన్
టీ20 ప్రపంచకప్ వరకు మహేంద్ర సింగ్ ధోనీనే భారత పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా కొనసాగుతాడని చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ స్పష్టం చేశాడు. కెప్టెన్సీపై ఊహాగానాలకు తెరిదించాలని, టీ20 ప్రపంచకప్‌లో తమ నాయకుడెవరో ఆటగాళ్లకు చెప్పాలని బోర్డు భావించిందని చెప్పాడు.
'మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేశాం. మీడియాలో ఊహాగానాలకు తెరదించాలన్నది మా ఆలోచన. ఒక్క మీడియానే కాదు, ఆటగాళ్లకు కూడా తమ నాయకుడెవరో తెలియాలి' అని అని సందీప్ పాటిల్ అన్నాడు.
ధోని భవిష్యత్తు గురించి అడిగినప్పుడు.. 'ఆటగాళ్ల భవిష్యత్తు గురించి బిసిసిఐ చర్చించదు. సెలక్టర్లు ఆటగాళ్లతో చర్చిస్తారు. ధోనీ భారత్ తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్. అతడి నాయకత్వంలో భారత్ రెండు ప్రపంచకప్‌లు గెలిచింది. టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకుంది. టీ20 ప్రపంచకప్ వరకు అతణ్ని మేం కెప్టెన్‌గా ఎంపిక చేయడం న్యాయమే' అని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పాడు.