ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ ట్రోఫీ ముద్దాడాలని అనుకుంటున్న భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. మిడిలార్డర్‌లో కీలకమైన ఆటగాడు వరల్డ్ కప్ ఆడేలా కనిపించడం లేదు. ఇప్పటికే టీమిండియా స్టార్లు చాలా మంది గాయాలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ ఇలా చాలా మంది క్రికెటర్లు గాయపడి ఉన్నారు.
అయితే వీరిలో బుమ్రా దాదాపు కోలుకున్నట్లే అని వార్తలు వస్తున్నాయి. అలాగే కేఎల్ రాహుల్ కూడా చాలా వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఆసియా కప్‌లో రాహుల్ మళ్లీ జట్టులోకి వచ్చేస్తాడట. ఐపీఎల్ సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో ఆటకు దూరమైన రాహుల్.. లండన్‌లో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే.

ఇక రిషభ్ పంత్ ఈ వరల్డ్ కప్ ఆడే అవకాశం కనిపించడం లేదు. అయితే మిడిలార్డర్‌లో కీలకం అనుకున్న శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ మెగా టోర్నీకి దూరమయ్యేలా ఉన్నాడట. దీనిపై బీసీసీఐకి చెందిన ఒక అధికారి కీలక వ్యాఖ్యలు చేశాడు. 'రాహుల్ బాగా కోలుకుంటున్నాడు. మహా అయితే ఒక నెలరోజుల్లో అతను ఫిట్‌గా తయారవుతాడు' అని సదరు అధికారి అన్నాడు.
'సర్జరీ తర్వాత కోలుకోవడం ఎప్పుడూ కష్టమే. వరల్డ్ కప్‌లో కూడా అతను చాలా కీలకమైన ప్లేయర్. కాబట్టి రాహుల్ కోలుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే సమయంలో శ్రేయాస్ అయ్యర్ అంత వేగంగా కోలుకోవడం లేదు. కానీ వరల్డ్ కప్ నాటికి కోలుకుంటాడని అనుకుంటున్నాం. అయితే అతను కచ్చితంగా వరల్డ్ కప్ ఆడతాడని చెప్పలేం' అని స్పష్టం చేశాడు.
'వరల్డ్ కప్ ముందు కూడా రాహుల్ కొన్ని మ్యాచులు ఆడాలనేది మా ఆలోచన. దానికి ఆసియా కప్ మంచి వేదిక. కానీ కుదిరితే ఐర్లాండ్ టూర్‌లోనే అతన్ని ఆడించాలని అనుకుంటున్నాం. వంద శాతం ఫిట్‌నెస్ సాధిస్తే అదే చేయాలని ఆలోచన. తను ఎంత వరకు కోలుకున్నాడనే దానిపైనే అతని రీఎంట్రీ ఆధారపడి ఉంటుంది. ఇక అయ్యర్‌కు ఇంకా టైం అవసరం' అని పేర్కొన్నాడు.