ఇవాళ నుంచి ప్రారంభం కానున్న అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు టీమిండియా వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ ఎంపిక అవ్వని విషయం తెలిసిందే. రాహుల్‌కు విశ్రాంతి ఇచ్చారా? విస్మరించారా? అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాహుల్ ద్రవిడ్... ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ గురించి స్పందించాడు. కానీ రాహుల్ గురించి ద్రవిడ్ ఏ విషయం చెప్పలేదు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు కేఎల్ రాహుల్ కూడా టీ20 ప్రపంచకప్‌లోనే చివరిగా టీ20 మ్యాచ్ ఆడాడు. రోహిత్, కోహ్లి అఫ్గాన్ సిరీస్‌తో పొట్టి ఫార్మాట్‌లో పునరాగమనం చేయనున్నారు. కానీ రాహుల్‌కు నిరాశే మిగిలింది. అతడిని సెలక్టర్లు పక్కన పెట్టారు. అయితే టెస్టుల్లో కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

అన్ని ఫార్మాట్లలో మిడిలార్డర్ బ్యాటర్‌గా, వికెట్‌కీపర్‌గా జట్టులో ఉండాలనుకుంటున్నానని ఇటీవలే ప్రకటించిన రాహుల్‌కు ఈ న్యూస్ బిగ్ షాకే. అయితే టీమిండియా మేనేజ్మెంట్ రాహుల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే పరిగణిస్తున్నట్టు సమాచారం. జనవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లోనూ రాహుల్‌ను బ్యాటర్‌గానే ఎంపిక చేయనున్నారు.
ఇటీవల రాహుల్ వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నాడని, అతడిపై పనిభారం తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌తో పాటు రంజీ ట్రోఫీ నుంచి అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు భారత్‌లోని టర్నింగ్ పిచ్‌లపై స్పెషలిస్ట్ వికెట్ కీపర్ అవసరమని బీసీసీఐ భావిస్తోంది. అందుకే రాహుల్‌ను కేవలం బ్యాటర్‌గానే ఇంగ్లాండ్ సిరీస్‌లో తీసుకోనుంది. అలాగే స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్‌ను పరిశీలిస్తోంది. దానికి తగ్గట్టుగానే భరత్‌ను ఇంగ్లాండ్ లయన్స్‌తో ఆడే భారత్-ఏ జట్టులో ఎంపిక చేసింది.
అయితే దక్షిణాఫ్రికాలో వన్డే, టెస్టు సిరీస్‌లో రాహుల్ వికెట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆఖరి టెస్టులో మార్క్‌రమ్ క్యాచ్‌ను చేజార్చడం మినహా వికెట్ల వెనుక ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అయితే ఇంగ్లాండ్ సిరీస్ అనంతరం ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ రాహుల్ పనిభారం గురించి వికెట్ కీపింగ్ బాధ్యతలు తప్పించి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంటే అఫ్గానిస్థాన్ సిరీస్‌కు రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదనేది అసలు ప్రశ్న.