
హైదరాబాద్: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ రికార్డుల మీద రికార్డులు నమోదు చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం గ్యారీ సోబర్స్ రికార్డుని సమం చేశాడు.
ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టు రెండో రోజైన శుక్రవారం స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 6,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించడానికి గాను స్టీవ్ స్మిత్‌కు 111 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (68 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు.
సిడ్నీ టెస్టుకు ముందు స్టీవ్ స్మిత్‌కు ఈ మైలురాయిని అందుకోవడానికి 26 పరుగులు అవసరమయ్యాయి. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 53వ ఓవర్ వేసిన లెగ్ స్పిన్నర్ మాసన్ క్రేన్ బౌలింగ్‌లో సింగిల్ తీయడంతో టెస్టుల్లో 6,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
స్టీవ్ స్మిత్ ప్రస్తుతం తన కెరీర్‌లో 61వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే ఐదో టెస్టు, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా (91 నాటౌట్), స్టీవ్ స్మిత్ (44 నాటౌట్) పరుగులతో ఉన్నారు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ ఇప్పటికే మూడు సెంచరీతో 600కు పైగా పరుగులు నమోదు చేశాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో స్టీవ్ స్మిత్ అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. 2017లో కూడా స్టీవ్ స్మిత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
అంతేకాదు బ్రాడ్‌మన్ తర్వాత అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా స్టీవ్ స్మిత్ నిలిచాడు. స్టీవ్ స్మిత్ ప్రస్తుతం తన ఖాతాలో 947 రేటింగ్ పాయింట్లను కలిగి ఉన్నాయి. డాన్ బ్రాడ్ మన్ 961 రేటింగ్ పాయింట్లో ఆల్ టైమ్ రికార్డుని నమోదు చేశాడు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్ ఒకడు. స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ యావరేజి 63. టెస్టుల్లో ఇప్పటికే 23 సెంచరీలు సాధించాడు.
టెస్టుల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు చేసిన ఆటగాళ్లు (Top 5):
* డాన్ బ్రాడ్‌మన్ - 68 ఇన్నింగ్స్‌లు
* స్టీవ్ స్మిత్, గ్యారీ సోబర్స్ - 111
* వాల్లీ హమ్మద్ - 114
* లెన్ హుట్టన్, కెన్ బారిగ్టంన్, కుమార సంగక్కర - 116
* సునీల్ గవాస్కర్ - 117
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.