
టీమిండియాతో కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సిరీస్ ఆరంభానికి ముందే ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఈ సిరీస్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. వేలికి గాయమవడంతో స్టార్క్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఇదే ఆసీస్ బౌలింగ్ బలాన్ని సగం తగ్గించేస్తుందని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఇప్పుడు వాళ్లకు మరో షాకింగ్ వార్త తెలిసింది. ఆస్ట్రేలియా జట్టులో మరో కీలక పేసర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా తొలి టెస్టు ఆడటం లేదట.
పాదంలో ఉండే అచిలీస్ హీల్ వద్ద గాయం అవడంతో హాజిల్‌వుడ్ తొలి టెస్టు ఆడటం లేదని తెలుస్తోంది. అతని గాయం తీవ్రంగా ఉండటంతో రెండో టెస్టులో కూడా హాజిల్‌వుడ్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. అలాగే యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా ఈ సిరీస్‌లో తొలి టెస్టులో బౌలింగ్ చేయడం కుదరదని సమాచారం. ఇక రెండో టెస్టులో అతను బౌలింగ్ చేసే అవకాశం ఉంది. తన గాయం గురించి హాజిల్‌వుడ్ మాట్లాడుతూ.. 'తొలి టెస్టు ఆడతానని నమ్మకం లేదు. ప్రస్తుతానికి ఇలా ఆడతాను.. మొదటి టెస్టు నాటికి కోలుకుంటానని అనుకుంటున్నా' అని చెప్పాడు.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు నుంచి ఈ గాయం తనను బాధిస్తోందని హాజిల్‌వుడ్ వెల్లడించాడు. ఇది చూసిన అభిమానులు ఆస్ట్రేలియాకు ఈ గాయాల బెడద ఏంటి? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే ఆ జట్టును ఇక ఆ దేవుడే కాపాడాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాగైతే భారత బ్యాటర్లు రెచ్చిపోతారని, ఈ వార్తలు వాళ్లకు చాలా సంతోషం కలిగిస్తాయని కొందరు అంటున్నారు. కీలకమైన ఆటగాళ్లంతా గాయాలపాలవడంతో ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను 2-1 తేడాతో ఓడిపోతుందని అభిమానులు జోస్యం చెప్తున్నారు.