
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మరో పురస్కారం వరించింది. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ అనిమల్స్(పేటా) ప్రతి ఏటా అందించే 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఈ సంవత్సరానికి విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది. శాకాహార ప్రోత్సాహకులను, జంతుజాల ప్రేమికులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారన్న సంగతి తెలిసిందే.
విరాట్ కోహ్లీకి మూగజీవులంటే ఇష్టం. రాజస్తాన్‌లోని అమర్ కోటలో మాలతి అనే ఏనుగును ఎనిమిది మంది వ్యక్తులు కూర్రంగా హింసించిన సంగతి తెలిసిందే. ఆ ఏనుగును హింసించడాన్ని నిరసిస్తూ 'పెటా'కు లేఖ రాశాడు. గతంలో బెంగళూరులో గాయపడ్డ, నిర్లక్ష్యానికి గురైన శునకాల వద్దకు వెళ్లి వాటిని దత్తత తీసుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చాడు.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని పెటా ఇండియా పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్భంగా "విరాట్ కోహ్లీ మూగజీవుల ప్రేమికుడు. జంతు హక్కుల ఉద్యమకారుడు. వాటిపై జరిగే అమానుషాలు, హింసను సహించడు. తనకు తోచిన రీతిలో వాటిని రక్షణకు పూనుకుంటాడు. అవసరమైన జంతువులకు అండగా ఉండేందుకు అతడి బాటలో ముందుకు నడవాలని ప్రతిఒక్కరిని పెటా ఇండియా ప్రోత్సహిస్తోంది" అని పెటా ఇండియా ప్రతినిధి సచిన్ బంగెరా అన్నారు.
గతంలో భారత్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ పనికర్ రాధాకృష్ణన్, బాలీవుడ్ నటీమణులు అనుష్క శర్మ, హేమ మాలిని, జాక్వలైన్ ఫెర్నాండెజ్, హీరో మాధవన్, సన్ని లియోన్, కపిల్ శర్మ పెటా పర్సన్ ఆఫ్ ఇయర్ అవార్డును అందుకున్నారు.