హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-మాజీ కోచ్ అనిల్ కుంబ్లేల మధ్య చోటు చేసుకున్న వివాదంపై ఓపెనర్ శిఖర్ ధావన్ స్పందించాడు. శుక్రవారం సాయంత్రం మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో శిఖర్ ధావన్ మీడియాతో మాట్లాడాడు.
కెప్టెన్ కోహ్లీ, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మధ్య విభేదాలేంటి? అని ప్రశ్నించగా.. 'నేను అనిల్ కుంబ్లే శిక్షణలో ఎక్కువగా భారత్ జట్టుకు ఆడలేదు. కాబట్టి ఈ విభేదాలపై నేను ఏమీ మాట్లాడలేను. అయితే ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయం, ఆత్మాభిమానం ఉంటాయి. అలానే కోహ్లీ, కుంబ్లే, ధోని ఇలా ఎవరికి తగ్గ వ్యక్తిగత అభిప్రాయాలు వారివి. అందులో ఎటువంటి సందేహం లేదు' అని ధావన్ అన్నాడు.

ఇటీవలే ఇంగ్లాండ్‌లో ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ధావన్... ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో కూడా వరుసగా రెండు అర్ధ సెంచరీలతో రాణించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ధావన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 125 పరుగులుగా ఉంది. ప్రస్తుతం తన గేమ్ పైనే ప్రస్తుతం దృష్టిసారించినట్లు ధావన్ పేర్కొన్నాడు.
'ఐపీఎల్ ముందు వరకు నేను చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాను. చెత్త ప్రదర్శనతో టీమిండియాలో స్థానం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో దేశవాళి క్రికెట్ ఆడుతూ మళ్లీ నా సామర్థ్యం నిరూపించుకున్నాను. రంజీల్లో బాగా ఆడితే భారత్ జట్టులోకి రావచ్చని నాకు తెలుసు. అందుకే ఒత్తిడిని పూర్తిగా వదిలేసి స్వేచ్ఛగా దేశవాళీ మ్యాచ్‌లను ఆస్వాదించడం మొదలెట్టాను' అని ధావన్ వివరించాడు.