కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా: తదుపరి కోచ్ ఎవరు?
హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ పదవికి మంగళవారం అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్టే కెప్టెన్ కోహ్లీతో విభేదాలే కుంబ్లే నిష్క్రమణకు కారణమైంది. కొత్త కోచ్ పదవి ఎంపికపై బోర్డు ఇంకా ఏం తేల్చుకోని నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఇంకో రెండు వారాల పాటు పదవిలో కొనసాగాలని, వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాలని బోర్డు కుంబ్లేను కోరింది.
దీనికి కుంబ్లే సానుకూలంగానే స్పందించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం వెస్టిండిస్ పర్యటన కోసం లండన్ నుంచి బయల్దేరిన భారత జట్టుతో కుంబ్లే వెళ్లలేదు. ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ హోదాలో లండన్‌లో జరుగుతున్న సమావేశంలో పాల్గొంటున్న కుంబ్లే.. ఈ నెల 23 వరకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యంలో తాను వెస్టిండీస్‌కు వెళ్లట్లేదని, తక్షణం కోచ్‌గా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని బోర్డుకు తెలియజేశాడు. కోచ్‌గా తన పద్ధతులపై కెప్టెన్‌కు అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తనకు తెలిపిన నేపథ్యంలో తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కుంబ్లే స్పష్టం చేశాడు.
కుంబ్లేతో కోహ్లీకి సయోధ్య కుదిర్చేందుకు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే కుంబ్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాన కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేసిన విషయాన్ని బీసీసీఐ కూడా ధ్రువీకరించింది.
'కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు ధ్రువీకరిస్తున్నాం. కోచ్‌గా కొనసాగాలని క్రికెట్ సలహా కమిటీ కోరినప్పటికీ కుంబ్లే అంగీకరించలేదు. భారత జట్టు మళ్లీ టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన కుంబ్లేకు అభినందనలు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలు అమోఘం. భవిష్యత్తులో కుంబ్లేకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం' అని బీసీసీఐ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ప్రధాన కోచ్‌గా కుంబ్లే రాజీనామాని ఆమోదించిన బోర్డు కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను ఆరంభించనుంది. ఇప్పటికే ఈ పదవికి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీలతో పాటు లాల్‌చంద్ రాజ్‌పుత్, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేష్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సీఏసీ వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది.
టీమిండియా తదుపరి కోచ్ ఎవరు?

వీరేంద్ర సెహ్వాగ్
టీమిండియా ప్రధాన కోచ్ రేసులో ఉన్న వాళ్లలో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. కోచ్ పదవికి కోసం చేసుకున్న దరఖాస్తులో సెహ్వాగ్ రెండు లైన్లతో కూడిన రెజ్యూమ్‌ని పంపి బీసీసీఐని బిత్తరబోయేలా చేశాడు. వాస్తవానికి సెహ్వాగ్‌కు ఎలాంటి కోచింగ్ అనుభవం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గత రెండు సీజన్ల నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.

టామ్ మూడీ
కోచ్ పదవికి పోటీ పడుతున్న వారిలో టామ్ మూడీ ముందంజలో ఉన్నారు. కొత్త కోచ్ ఎంపిక విషయంపై మాట్లాడిన ఓ బీసీసీఐ అధికారి టామ్ మూడీకి చాన్స్ ఎక్కువగా ఉందని తెలిపారు. గతంలో కూడా టామ్ మూడీ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. టామ్ మూడీ గతంలో శ్రీలంక జట్టుతో పాటు వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్లకు కోచ్‌గా కూడా వ్యవహరించారు. ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తుండటంతో ఆయనకు భారత్‌లోని పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

లాల్ చంద్‌రాజ్‌పుత్
లాల్ చంద్‌రాజ్‌పుత్ 2007లో టీ20 ప్రపంచ్‌కప్ గెలిచిన భారత్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. ఆయనకు కోచింగ్‌లో మంచి అనుభవం ఉంది. అండర్ 19, ఇండియా-ఎ జట్లకు కూడా కోచ్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నారు.

రిచర్డ్ పైబస్
ఇంగ్లాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్. గతంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జాతీయ జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం వెస్టిండిస్ క్రికెట్ బోర్డు డైరక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 2013 నుంచి ఈ పదవిలో ఆయన కొనసాగుతున్నారు.

దొడ్డ గణేష్
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ దొడ్డ గణేష్. టీమిండియా ప్రధాన కోచ్ పదవికి తన దరఖాస్తుని పంపారు. ప్రధాన కోచ్ రేసులో నిలవడం ఎంతో సంతోషంగా ఉందని గతంలో వన్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications