హైదరాబాద్: 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న పార్దీవ్ పటేల్‌పై టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ప్రశంసల వర్షం కురింపిచాడు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కుంబ్లే మొహాలి టెస్టులో బ్యాటింగ్, కీపింగ్‌లో పార్ధీవ్ పటేల్ రాణించిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు.
మొహాలీ టెస్టులో ఓపెనింగ్ చేస్తానని పార్థివ్ కోరుకున్నాడని, దానిని అతను సమర్థంగా నిర్వహించాడని కుంబ్లే ప్రశంసించాడు. '8 ఏళ్ల తర్వాత టెస్టు ఆడినా పార్థివ్ ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదు. కీపర్‌గా, అప్పటికప్పుడు ఓపెనర్‌గా కూడా తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నెరవేర్చాడు. కష్టానికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని అతని పునరాగమనం చూపించింది' అని పేర్కొన్నాడు.
ఓపెనింగ్ చేయడంతో పాటు వికెట్ల వెనుక కీపింగ్ కూడా బాగా చేశాడని కితాబిచ్చాడు. అయితే భారీ స్కోరు చేయనందుకు ఎలాంటి బాధ లేదని స్పష్టం చేశాడు. 'తన 16 ఏళ్ల వయసులోనే జట్టును ఓటమినుంచి రక్షించాడు పార్ధీవ్. గడ్డం గీసుకుంటే ఇప్పటికీ అతను 16 ఏళ్లవాడిలాగానే కనిపిస్తాడు' అని కుంబ్లే వ్యాఖ్యానించాడు.

ఇదిలా ఉంటే రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా మూడో టెస్టు బరిలోకి దిగిన పార్థివ్ పటేల్‌కు మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టులోనూ అతను ఆడతాడని బీసీసీఐ ప్రకటించింది. సాహా కోలుకున్నా ముందు జాగ్రత్తగా అతనికి మరింత విశ్రాంతి కల్పించినట్లు బోర్డు చెప్పింది.
మొహాలి టెస్టులో పార్ధీవ్ పటేల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 42, 67 నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇంగ్లాండ్‌పై 2-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. రాజ్‌కోట్‌లో జరిగిన టెస్టు డ్రాగా ముగియడంతో ఆ తర్వాత విశాఖ, మొహాలిలో జరిగిన టెస్టుల్లో భారత్ విజయం సాధించింది.