పెర్త్: క్రికెట్లో తాను ఆరాధించే హీరోల్లో భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఒకరని టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ చెప్పారు. కఠినమైన పరిస్ధితుల్లో ఉన్నప్పుడు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని అన్నారు. ఐసీసీ వరల్డ్ కప్‌లో పూల్ బీలో వెస్టిండిస్‌తో శుక్రవారం జరగనున్న మ్యాచ్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
అనిల్ కుంబ్లే ప్రశంసలను గుర్తు చేసినప్పుడు గురువారం స్పందించాడు. నైపుణ్యం పరంగా కేరీర్ మొత్తంలో నేను చాలా మంది వ్యక్తులను ఆరాధిస్తానని అన్నారు. నేను ఆరాధించే గొప్ప క్రికెటర్లలో అనిల్ కుంబ్లే ఒకరు. కారణం కఠిన పరిస్ధితుల్లో ప్రతిసారీ ఆయన విజయవంతంగా వాటిని ఎదుర్కొంటాడని పేర్కొన్నారు.

చాలా సందర్భాల్లో చాలా మంది మీ రోల్ మోడల్ ఎవరూ అని ప్రశ్నించారు. దానికి నేను సమాధానంగా నా రోల్ మోడల్స్‌లో కుంబ్లే ఒకరని చెప్పానన్నారు. అతని స్ధానాన్ని భర్తీ చేయడం కష్టమన్నారు. కానీ, భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు.
క్రికెట్ కెరీర్‌లో తొలుత బ్యాట్స్‌మెన్‌గా పరిచయమైన చాన్నాళ్లకు స్పిన్ బౌలంగ్‌ను నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. 1990వరకు కూడా నేను బ్యాట్స్‌మెన్‌గానే రాణించాను. మంచి స్పిన్నర్ అవ్వాలనే కోరికతోనే స్పిన్ బౌలింగ్‌ను తర్వాత కాలంలో ప్రాక్టీస్ చేశానన్నారు.
ఇక బౌలర్లకు సవాలు విసిరే గేల్ లాంటి ఆటగాళ్లంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. గేల్ డివిలియర్స్ లాంటి ఆటగాళ్ల ఆటకట్టించడాన్ని తానెప్పుడూ సవాలుగా తీసుకుంటానని అందుకే అలాంటి వారికి బౌలింగ్ చేయడం తనకెంతో ఇష్టమని చెప్పారు. రేపటి మ్యాచ్‌కు బాగా సంసిద్ధమవుతున్నామని, వెస్టిండీస్‌పై తప్పక విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు.
ఇటీవలే తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ అశ్విన్ అచ్చం తనలాగే ఆడుతున్నాడని భారత్ మాజీ క్రికెట్ అనిల్ కుంబ్లే అన్నారు. ఆదివారం మెల్‌బోర్న్‌లో దక్షిణాఫ్రికా-ఇండియా మధ్య జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు.
అశ్విన్ బౌలింగ్ విధానం, క్రీడాస్ఫూర్తి, ప్రశాంతంగా ఉండే తత్వం అంతా తనలాగే పోలి ఉన్నాయని చెప్పారు. తాను టీమిండియాకు ఆడే సమయంలో అలాగే ఉండేవాడినని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకంటే అతను మంచి ఆటగాడని పేర్కొన్న విషయం తెలిసిందే.