కుంబ్లేకి ఘనమైన వీడ్కోలు: 'కోహ్లీ అహంభావమే ఇలా చేసింది'
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో 17 ఏళ్ల సుదీర్ఘ అనుభవం. ఏడాదిపాటు టీమిండియాకు అద్భుతమైన సేవలు అందించినప్పటికీ అవమానకరీతిలో కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే తప్పుకున్న సంగతి తెలిసిందే. కోచ్‌గా అనిల్ కుంబ్లే ఉన్నది ఏడాది కాలమే అయినప్పటికీ, ఆ పదవికే కుంబ్లే వన్నె తెచ్చాడు.
గతేడాది వెస్టిండీస్ పర్యటనతో కోచ్‌గా కుంబ్లే ప్రస్థానం ఆరంభమైన సంగతి తెలిసిందే. అక్కడ టెస్టు సిరీస్‌లో భారత్ 2-0తో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్ ఓడింది. కుంబ్లే హయాంలో భారత్ కోల్పోయిన ఏకైక ద్వైపాక్షిక సిరీస్ ఇదే. ఆ తర్వాత సొంతగడ్డపై భారత్ వరుసగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై సిరీస్‌లు కైవసం చేసుకుంది.
ఇలా స్వదేశంలో ఆడిన టెస్టుల్లో ఒక్కదాంట్లో మాత్రమే ఓడి ఏకంగా 12 టెస్టుల్లో విజయం సాధించింది. టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానంలో నిలిచింది. కుంబ్లే హయాంలోని టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వరకు చేరింది. కుంబ్లే చివరగా బాధ్యతలు నిర్వర్తించిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది.
ఆటగాడిగా ఎంత నిబద్ధత
ఓ ఆటగాడిగా ఎంత నిబద్ధత ప్రదర్శించాడో.. ఒక కోచ్‌గా కూడా అనిల్ కుంబ్లే అంతే క్రమశిక్షణతో మెలిగాడని సన్నిహితులు చెప్తున్నారు. కొత్త కోచ్ పదవి ఎంపికపై బోర్డు ఇంకా ఏం తేల్చుకోని నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఇంకో రెండు వారాల పాటు పదవిలో కొనసాగాలని, వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాలని బోర్డు కుంబ్లేను కోరింది.
వెస్టిండిస్ పర్యటనకు కోచ్‌గా పొడిగింపు
అయితే వెస్టిండిస్ పర్యటనకు కోచ్‌గా రెండువారాల పొడిగింపు కుంబ్లేకు ఇచ్చినా.. దానిని ఆయన తిరస్కరించి మంగళవారం రాజీనామా చేశాడు. కోచ్‌గా తన పద్ధతులపై కెప్టెన్‌కు అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తనకు తెలిపిన నేపథ్యంలో తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కుంబ్లే స్పష్టం చేశాడు.
బీసీసీఐ నుంచి సమాచారం
సోమవారం తాను బీసీసీఐ నుంచి ఓ సమాచారం అందుకున్నానని, ప్రధాన కోచ్‌గా కొనసాగాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించిన విధంగా జట్టు శిక్షణలో కొన్ని మినహాయింపులు పాటించాలని తనని కోరిందని అన్నాడు. కోచ్-కెప్టెన్‌కు మధ్య సరిహద్దులను తాను ఎప్పుడూ గౌరవించానని, ఆయన తన పాత్ర అతనికి నచ్చకపోవడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు.
తప్పుకోవడమే మేలనిపించి ఈ నిర్ణయం
కెప్టెన్‌కు నాకు మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు బీసీసీఐ పూర్తిస్థాయిలో ప్రయత్నించినా మా ఇద్దరి భాగస్వామ్యం అసంపూర్ణంగా ముగిసిందని, దీంతో తప్పుకోవడమే మేలనిపించి ఈ నిర్ణయం తీసుకున్నానని తన రాజీనామా లేఖలో కుంబ్లే పేర్కొన్నాడు.
కోహ్లీ తిట్టడం వల్లే కుంబ్లే మనస్తాపం
మరోవైపు కుంబ్లేని కోహ్లీ తిట్టడం వల్లే మనస్తాపం చెంది అర్ధంతరంగా కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో కుంబ్లేకు సోషల్ మీడియాలో అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. కుంబ్లే సేవలను కీర్తిస్తూ వీడ్కోలు పలుకుతున్నారు. కోహ్లీ అహంకారం, అహంభావం వల్లే కుంబ్లే తప్పుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications