హైదరాబాద్: శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. సొంతగడ్డపై జింబాబ్వే చేతితో జరిగిన వన్డే సిరిస్‌ను 3-2తేడాతో కోల్పోయిన నేపథ్యంలో జట్టు కెప్టెన్‌గా వైదొలిగాడు. టెస్టు, వన్డే, టి20 ఇలా మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఇటీవలే జింబాబ్వే జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా ఆడిన ఐదు వన్డేల సిరిస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. జింబాబ్వేతో సిరీస్‌లో చివరి వన్డే ముగిసిన తర్వాత సిరీస్ ఓటమిపై మాథ్యూస్ విచారం వ్యక్తం చేశాడు.

జింబాబ్వే చేతిలో ఓడటాన్ని తన కెరీర్‌లోనే అత్యంత ఘోర పరాభవంగా చెప్పాడు. సెలెక్టర్లతో చర్చించి తన భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. జయవర్ధనే వారసుడిగా 2013లో జట్టు పగ్గాలు చేపట్టిన మాథ్యూస్ 34 టెస్టులు, 98 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అతని సారథ్యంలోనే గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను లంక క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఈ సీజన్‌లో అతను గాయంతో కీలకమైన సిరీస్‌లకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్, ఆస్ట్రేలియాతో జరిగిన టి20లకు, స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లకు అతను గైర్హాజరయ్యాడు.
మాథ్యూస్ వారసుడిగా దినేశ్ చండిమాల్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. లండన్ వేదికగా ఇటీవలే ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంక జట్టు ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ కోచ్ గ్రాహం ఫోర్డ్ కూడా రాజీనామా చేశాడు.